Seethakka Fires on Kavitha: కరప్షన్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని ఆ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ మేరకు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పరువు తీసింది ఎవరో ప్రజలకు తెలిసిందేనని, ఢిల్లీ వ్యాపారులతో మీ కుటుంబమే రాష్ట్ర పరువు తీసిందని ఆరోపించారు. శాసనమండలిలో మాట్లాడిన సీతక్క, బీఆర్ఎస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర
బీఆర్ఎస్ తన మొదటి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళా మంత్రిని కూడా నియమించలేదని శాసన మండలిలో మంత్రి సీతక్క విమర్శించారు. మహిళా కమిషన్‌కు సభ్యులను సైతం నియమించలేదని అన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయహస్తం నిధులు విడుదల చేయలేదని, పావలా వడ్డీ సదుపాయం లేకుండా చేశారని ఆరోపించారు. మహిళా సంఘాలకు కట్టాల్సిన రూ.3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ మెుదటి సారి 63 సీట్లతో అధికారంలోకి వచ్చిందన్న సీతక్క.. తాము 65 సీట్లతో అధికారంలోకి వచ్చామని ఆమె గుర్తు చేశారు. తాము వచ్చి 15 నెలలు అయిందని, అప్పుడే అన్నీ కావాలన్నట్టుగా అక్కసు వెల్లగక్కుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అని, మహిళలకు అడుగడుగునా అన్యాయం చేసింది బీఆర్ఎస్ అని ఆరోపించారు.
రైతులకు నష్టం, ఉద్యోగులకు అన్యాయం..
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తమ పాలనను సస్యశ్యామలంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేసిందని సీతక్క ఆరోపించారు. ‘మీరు నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుంటే, రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు?’ అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా, నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. ‘59 వేల ఉద్యోగాలను మేము భర్తీ చేశాం. మీరు నిజంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారు?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పదేళ్లపాటు పాలించిందని, కానీ గృహనిర్మాణ ప్రాజెక్ట్‌లో విఫలమైందని ఆమె ఆరోపించారు. ‘దశాబ్దం పాలించిన మీరు ప్రజలకు ఇళ్లు ఇవ్వకపోవడంతో, చివరికి ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు.’ అని ఎద్దేవా చేశారు.
Also Read: Konda Surekha: ప్రజల సహకారం కోరిన మంత్రి సురేఖ.. ఎందుకంటే?
మీరు తక్కువ మాట్లాడితే మంచిది..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఉల్లంఘించి భారీగా అప్పులు తెచ్చిందని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది అప్పుల కోసమేనని సీతక్క అన్నారు. ‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఎందుకింత కడుపుమంట?’ అంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ‘మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది!’ అంటూ సీతక్క కౌంటర్ ఇచ్చారు.