Minister Seethakka: సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను దివ్యాంగులకు అమలు చేస్తోందని, అందుకే సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షల నిర్వహణకు ఒక్కో ఆసుపత్రికి 10లక్షలు రిలీజ్ చేశామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంగళవారం బేగంపేట లోని టూరిజం ప్లాజా లో సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపు పై డాక్టర్లకు వర్క్ షాప్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో సదరం క్యాంపు నిర్వహిస్తున్నామని, మొత్తం 3.8 కోట్లను రిలీజ్ చేశామన్నారు. గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని దివ్యాంగుల్లో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్ర లో మొదటి సారి వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం
ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర వైకల్యం ఉంది అనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, అర్హులు చాలామంది నష్టపోయారన్నారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. చేయూత పెన్షన్, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యో వికాసం ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్ ఆధారం అన్నారు.
Also Read: KTR: సీడ్ కంపెనీల.. అక్రమాలను అడ్డుకోవాలని!
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
డాక్టర్లు మానవతను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అర్హులు ఎవరు నష్టపోకూడదన్నారు. ఓర్పు నేర్పుతో పరీక్ష నిర్వహించి ధీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. 21 రకాల వైకల్యాలను గుర్తించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, అందుకు అనుగుణంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్నారు. ఈ పవిత్ర యజ్ఞంలో దివ్యాంగులందరికీ డాక్టర్లు అండగా నిలవాలని కోరారు. దివ్యాంగుల పరికరాల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 50 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, సదరం డైరెక్టర్ సాయి కిషోర్, న్యూ ఢిల్లీ ఎయిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లోని పలు విభాగాధిపతులు, స్పెషలిస్ట్, డాక్టర్లు పాల్గొన్నారు.
బాలల భవిష్యత్ కోసం నిరంతరం కృషి మంత్రి సీతక్క
చార్మినార్ వద్ద ఈనెల 12న బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ను పురస్కరించుకొని బహిరంగ అవగాహన సభ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపీసీఆర్) రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మిక నిర్మూలనపై అవగాహన పెంపొందించేందుకు ఒక వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిశ్చయించింది.
విద్యా, ఆరోగ్య, హక్కుల పరిరక్షణను కల్పించడమే లక్ష్యం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యక్రమాల నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్సీపీసీఆర్ కమ్యూనికేషన్ పంపించిందన్నారు. జిల్లా స్థాయిలో పాఠశాల అవగాహన శిబిరాలు, ర్యాలీలు, గ్రామ సభలు, పౌరసమాజ భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమాజాన్ని చైతన్యపరచి, బాల కార్మికతకు చెక్ పెట్టి, పిల్లలకు విద్యా, ఆరోగ్య, హక్కుల పరిరక్షణను కల్పించడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
Also Read:Mahabubabad: పాఠశాలలో శానిటేషన్.. హెల్త్ ఎడ్యుకేషన్ ప్రత్యేక దృష్టి పెట్టాలి!