తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Minister Seethaka: తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హెచ్చరించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సామాజిక దురాచారాలను, రుగ్మతలను పారదోలే విధంగా అంగన్వాడి కేంద్రాలు పని చేయాలన్నారు. బాల్య వివాహాలు ఒకటి కూడా లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై దాడులు వెలుగు చూసిన వెంటనే జిల్లా సంక్షేమ అధికారులు కేసులు నమోదుచేయాలన్నారు.
బాధితులకు భరోసా కల్పించే విధంగా అధికారులు వ్యవహరించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. జిల్లా అధికారులు కనీసం వారానికి మూడు అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలని సచించారు. పోషకాహార తెలంగాణే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు. రాష్ట్రంలో 313 సెంటర్లు ఇంకా తెరుచుకోలేదని, చిన్నారులు లేరనే సాకు చెప్పడం సరికాదన్నారు. చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కలకళలాడాలన్నారు. అంగన్వాడి కేంద్రాలకు గ్రేడింగులు ఇస్తామని వెల్లడించారు.
Also Read: Damodar Rajanarsimha: పార్టీలో వారికే ప్రత్యేక స్థానం.. మంత్రి దామోదర రాజనర్సింహ
మంచి గ్రేడింగ్లూ వచ్చే కేంద్రాల సిబ్బందికి, జిల్లా అధికారులకు అవార్డ్స్ ఇస్తామని ప్రకటించారు. అంగన్వాడికి అందే సరుకుల్లో నాణ్యతా లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సెంటర్ లో కనీసం 20 మంది చిన్నారులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. బడి బాట తరహాలోనే మీరు గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. 30 అంగన్వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరు 198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5 లోపే ఉంది. 586 కేంద్రాల్లో పదిలోపే ఉన్నారని మంత్రి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చిన్నారుల సంక్షేమం పై వందల కోట్లు ఖర్చు చేస్తుందని, మీరు సీరియస్ గా ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. అంగన్వాడి సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత మీదేఅన్నారు.
కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు ఈ-టెండర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదు మీ తప్పిదాల వల్ల మేము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిని నిలిపి వేసి ఈ- టెండర్ విధానాన్నీ అవలంబించాలని సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్ మెంట్ కమిటీ ద్వారా టెండర్లు పిలువాలన్నారు. పరిశుభ్రత, పౌష్టికాహారంలో అంగన్వాడి కేంద్రాలు నెంబర్ వన్ గా నిలవాలన్నారు. డీడబ్ల్యూ ఓ లతో మే మొదటి వారంలో చింతన్ శివిర్ నిర్వహిస్తామన్నారు.
అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకుల్లో నాణ్యతా లోపిస్తే కాంట్రాక్టులను బ్లాక్ లిస్టు లో పెడతామని హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లాలో కోడిగుడ్ల సరఫరా సరిగా చేయని ఓ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామ చంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అదికారులు, జిల్లా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
Also Read: CWC meeting: ఏఐసీసీ ప్లీనరీలో కీలక నిర్ణయాలు.. 7 తీర్మానాలకు ఆమోదం!