తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Minister Seethaka: త్వరలోనే గోదాములు, మిల్లులను మహిళా సంఘాలకు అప్పగిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.3500 కోట్ల వడ్డీ ఎగ్గొట్టిందని, మేము మహిళా సంఘాలకు వడ్డీలను చెల్లిస్తున్నామన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో పావలా వడ్డీని గత ప్రభుత్వం వసూలు చేస్తే.. మేము ఇష్టంగానే వేలకోట్ల రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామ్నారు. ఇప్పటికీ మహిళా సంఘాలకు 23వేల కోట్ల బ్యాంకు రుణాలను ఇప్పించామన్నారు.
వ్యక్తిగత గృహ అవసరాలకు కాకుండా వ్యాపారాలు పెంచుకునే విధంగా మహిళా సంఘాలు రుణాలను వినియోగించుకుంటున్నాయన్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి మహిళలను కాపాడేందుకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీ నిధి సహకార సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి సంఘాలు కాదని, పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయన్నారు. స్త్రీనిధి బ్యాంకుకు 800 కోట్ల సేవింగ్స్ ఉన్నాయన్నారు.5200 కోట్ల మూల నిధి ఉందన్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారన్నారు.
Also Read: CM Revanth Reddy: కడుపు నిండా విషం.. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్
కోటి మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణం స్థాయి నుంచి మహిళా సంఘాలే ఇప్పుడు బస్సులకు ఓనర్లు అయ్యారన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండున్నర లక్షల చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం ఇక్రిసాతో ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వనరుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read: BRS MLAs Walks Out: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫైర్.. దెబ్బకు విపక్ష పార్టీ వాకౌట్
మహిళా సంఘం అంటే ఆర్థిక భరోసానే కాదు సామాజిక రక్షణగా నిలవాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు కాదు.. ఇది మహిళా సైన్యం అన్నారు. ఆర్మీ దేశాన్ని పరిరక్షిస్తున్న విధంగానే..మీరు మహిళలను పరిరక్షించే మహిళా ఆర్మీ అని కితాబు ఇచ్చారు. ప్రతి మహిళాస్వయం సహాయకసంఘాల్లో సభ్యురాలిగా ఉండాలన్నారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం కోసం తన వంతు బాధ్యతగా రూ.22 కోట్ల ను స్త్రీ నిధి బోర్డు అందజేసింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు