Kalyana Lakshmi Scheme: తెలంగాణ ప్రజలందరూ ఎదురుచూస్తున్న ఆ పథకం గురించి ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ శాసనమండలి సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలుపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.. పథకాల అమలుపై కీలక ప్రకటన చేయడం విశేషం. దీనితో తెలంగాణలో కళ్యాణ లక్ష్మీ పథకం అమలుపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయని చెప్పవచ్చు.
తెలంగాణ ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు, గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రుణమాఫీ, రైతుబంధు, ఇలా ఎన్నో పథకాలను సీఎం రేవంత్ సర్కార్ అమలు చేసింది.
ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల అభివృద్ధికి సంబంధించి స్వయం సహాయక సంఘాల ద్వారా పెట్రోల్ బంక్ లు, ఆర్టీసీ సంస్థకు బస్సుల యజమానులుగా ఉండేందుకు సైతం మహిళలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి మహిళను కోటీశ్వరురాలు చేయాలన్నదే తన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగ సభల ద్వారా చెప్పుకొచ్చారు.
మహిళా సంక్షేమానికి కృషి చేయడంలో ఏమాత్రం తాము వెనకడుగు వేయబోమని సీఎం చెప్పినట్లుగానే, సోమవారం తెలంగాణ శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు గురించి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు గత 10 సంవత్సరాల కంటే మెరుగైన పథకాలను తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని తాము సైతం కొనసాగిస్తామని, కళ్యాణ లక్ష్మిని కళ్యాణమస్తుగా మార్చి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తామని పొన్నం తెలిపారు. 2, 3 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించి బకాయిలు ఉన్నాయని, వాటిని తాము పూర్తిచేయడం జరిగిందంటూ ప్రకటించారు. కళ్యాణ లక్ష్మి నిధులకు సంబంధించి ఇబ్బంది లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వివాహాలు చేసుకునే వారికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: KCR: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరం? బడ్జెట్ రోజు కూడా?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివాహం జరిగిన ఎన్నో ఏళ్లకు చెక్కులు తీసుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం బకాయిలు లేకుండా తాము వెంటనే చెల్లిస్తున్నట్లు పొన్నం తెలిపారు. కళ్యాణ లక్ష్మి పెండింగ్ బకాయిలపై బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని పొన్నం సూచించారు. ఖచ్చితంగా తెలంగాణలో కళ్యాణ లక్ష్మి తాము బరాబర్ కొనసాగిస్తామని మంత్రి పొన్నం చెప్పారు.