Indiramma Indlu: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడి సొంతింటి కలను ఈ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. బుధవారం కల్లూరు మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రధాన బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నామని అన్నారు.
రెండో విడత ఇళ్ల మంజూరు
తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. లబ్ధిదారులు నిర్మించుకునే ఇంటి స్థాయిని బట్టి ప్రతి సోమవారం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు.
9 నెలల్లో రూ.21 వేల కోట్లు మాఫీ
గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే నారాయణపురం – పేరువంచ (రూ. 2 కోట్లు), నారాయణపురం- రామకృష్ణపురం (రూ. 4 కోట్లు), పేరువంచ – కుప్పనకుంట్ల (రూ. 7 కోట్లు), కొత్త నారాయణపురం – ఎన్ఎస్పీ కెనాల్ లిఫ్ట్ (రూ. 2 కోట్లు) వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వంద శాతం ప్రతి పల్లెకు మౌలిక వసతులు కల్పించే వరకు విశ్రమించేది లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 25 లక్షల మంది రైతన్నలకు రూ. 21 వేల కోట్ల మేర రుణమాఫీ చేసి అండగా నిలిచామని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం సరఫరా, కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు గురుకుల విద్యార్థుల డైట్ చార్జీలను 40 శాతం పెంచి విద్యా రంగానికి పెద్దపీట వేశామని మంత్రి పొంగులేటి అన్నారు.
Also Read: New Year 2026 Hyderabad: న్యూయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!
పనుల జాప్యంపై అసహనం
కల్లూరు మండల పర్యటనలో భాగంగా పేరువంచ ఉన్నత పాఠశాల మంత్రి పొంగులేటి అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, అధికారుల పనితీరును ప్రశ్నించారు. ప్రహారీ గోడ సహా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ రెండు నెలల్లోగా పూర్తి కావాలని, నిర్లక్ష్యం వహిస్తే కుదరదని స్పష్టం చేశారు.

