KCR: తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర, కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి సాంప్రదాయాలకు పదేండ్ల బిఆర్ఎస్ పాలన పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. గోదావరిలోయ పరీవాహక ప్రగతితో సమాంతరంగా సాగిన ఆధ్యాత్మిక అభివృద్ధిని స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని, సమ్మక్క సారలమ్మ దేవతలను ప్రార్థించారు.
Also Read: HYDRA Hyderabad: భేష్…హైడ్రాపై కురుస్తున్న ప్రశంసల జల్లు.. ఎందుకంటే?
ప్రజలందరికీ శుభం కలగాలి: మంత్రి సీతక్క
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే కోట్లాది భక్తులందరికీ మంత్రి సీతక్క(Minister Seethakka) శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచె ఈ మహాజాతర ప్రతి భక్తుడి హృదయంలో భక్తి భావాన్ని నింపాలని, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి శాంతి, ఆనందం కలగాలని మంత్రి ఆకాంక్షించారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనంతో ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, సమృద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. రవాణ, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులు సమకూర్చామని పేర్కొన్నారు. భక్తులందరూ సురక్షితంగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని ఆమె కోరారు. సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరికీ శుభం కలగాలని పేర్కొన్నారు.
Also Read: Vijay Career: విజయ్ దేవరకొండ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఇదే.. తరుణ్ భాస్కర్

