Telangana Bandh: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనలో భాగంగా నిర్ణయం
మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ వెల్లడి
మహబూబాబాద్, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బంద్ కార్యక్రమాన్ని (Telangana Bandh) విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక లేఖ విడుదల చేశారు. కరుడుగట్టిన మనువాద భావజాలమున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కలిసి పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఐక్యమై ఆర్ఎస్ఎస్, బీజేపీ మను వాదులకు వ్యతిరేకంగా గట్టి ప్రజా ఆందోళనలను చేపట్టాలని కోరారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ 11 ఏళ్లుగా దేశంలో నియంతృత్వాన్ని అమలు చేస్తుందని మండిపడ్డారు.
Read Also- Konda Surekha: మీనాక్షి నటరాజన్‌తో భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు!
రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనుస్మృతిని, వర్ణ వ్యవస్థ భావజాలాన్ని ప్రచారం చేస్తూ, కుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా పాలన సాగిస్తున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు. దేశంలోని ఆదివాసి, దళిత, వెనుకబడిన కులాల, మైనార్టీ అస్తిత్వాన్ని, సంస్కృతిని, భాషను నిర్మూలించేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.100 నాణెం, పోస్టల్ స్టాంపును ప్రధానమంత్రి విడుదల చేయడంతో, స్వాతంత్య్ర పోరాటంలో విద్రోహక పాత్ర పోషించిన ఆర్ఎస్ఎస్‌ను అధికార పీఠం మీద అధిష్టించినట్లుగా స్పష్టమైందని విమర్శించారు. మనువాదులకు అచ్చే దిన్, పీడిత ప్రజలకు దుర్ధినాలుగా ఉంటుందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశ ప్రజలు స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ను కోరుతూ శాసనసభలో బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించినా, ఇప్పటివరకు అతిగతి లేదని మండిపడ్డారు.
11 ఏళ్లుగా మనువాదులు జెట్ స్పీడ్‌తో ఆర్థిక విషయంలో కార్పొరేట్ అనుకూల పాలసీలను, సామాజికంగా వర్ణ వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్‌ను ముందుకు తీసుకొచ్చిందన్నారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక పాలసీలు రద్దు చేస్తేనే మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మనువాదులు నయాభారత్ నిర్మాణం చేయాలనే ప్రజల మీద మారరణకాండలు జరుపుతున్నారని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా న్యాయపరంగానూ చట్టాన్ని తెచ్చేందుకు పోరాటం చేయాలని కోరారు. పార్లమెంటులో చట్టం ద్వారా బీసీ రిజర్వేషన్ ప్రక్రియకు పరిష్కారం ప్రధానం అవుతుందని, అన్ని పార్టీలు, సంఘాలు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు కలిసి సమస్య పూర్వపరాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రశా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
