Konda Surekha: తనకు ఓఎస్డీగా వ్యవహరించిన సుమంత్ అనే వ్యక్తిని ప్రభుత్వం తొలగించడం, అతడిని అరెస్ట్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లినప్పుడు తన నివాసం వద్ద చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పలువురు సహచర మంత్రుల విషయంలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు వివరించినట్టు ఆమె తెలిపారు. తన బాధలను పంచుకున్నానని, పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను చెప్పింది ఆలపించిన మీనాక్షి నటరాజన్, అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ భరోసా ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత అన్ని ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చినట్టు కొండా సురేఖ వివరించారు. మిగతా విషయాలు వారే చూసుకుంటారనే భావనతో తిరిగి వెళ్తున్నట్టు చెప్పారు.
కాగా, మీనాక్షి నటరాజన్‌ను కలవడానికి తనవెంట కూతురు సుస్మితను కూడా కొండా సురేఖ తీసుకెళ్లారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. దగ్గరదగ్గరగా ఈ సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగింది. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ మీనాక్షి నటరాజన్ వద్ద కొండా సురేఖ వాపోయినట్టుగా సమాచారం.
Read Also- Clapboard: సినిమా షూటింగ్‌లో ‘క్లాప్’ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న కీలక రహస్యమిదే!
కేబినెట్ భేటీకి దూరం
గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగిన కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. కేబినెట్ భేటీకి హాజరుకాకపోవడానికి కారణాలు ఏంటనేది ఇటు ప్రభుత్వవర్గాలు గానీ, అటు కొండా సురేఖ వైపు నుంచి గానీ తెలియరాలేదు. కొండా సురేఖ తప్ప మంత్రిమండలిలోని మిగతా సభ్యులంతా హాజరయ్యారు. అయితే, కేబినెట్ భేటీకి కొన్ని గంటల ముందు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను కొండా సురేఖ కలిశారు. తన కూతురు సుష్మితను వెంటతీసుకెళ్లిన ఆమె తాజా పరిణామాలపై చర్చించినట్టుగా తెలిసింది.
Read Also- Anshu: నాగార్జున హీరోయిన్ జాకెట్ లెస్ ఫోటోషూట్.. ‘ఈ వయసులో అవసరమా?’ అంటూ విమర్శలు!
ఏంటీ వ్యవహారం?
మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా పనిచేసిన సుమంత్… ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో, సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఇదే సమయంలో ఫిర్యాదు అందడంతో బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లగా, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత అడ్డగించారు. దీంతో, కాసేపు ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. అంతకుముందు, మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనుల కాంట్రాక్టుల విషయంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంత్రి కొండా సురేఖకు విభేదాలు ఏర్పడిన విషయం బహిర్గతం అయ్యింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా ఊహాగానాలు వెలువడ్డాయి. కొండా సురేఖను పార్టీ హైకమాండ్ మందలించిందని, మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నారనే కోణంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి తొలగింపునకు బలం చేకూర్చే పరిణామాలు ఇప్పటివరకు ఏమీ జరగలేదు. అయితే, కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
