Mahesh Kumar Goud: మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాయితీ, దూరదృష్టి, అంకిత భావంతో మన్మోహన్ దేశాభివృద్ధికి సేవలు అందించారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చి, అభివృద్ధి పథంలో నడిపించిన అపూర్వ నాయకుడు డా. మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపై నిలబెట్టిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఆర్థిక స్వేచ్ఛ, పరిశ్రమల అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చాయని అన్నారు.
Also Read: Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో సేమ్ ఇదే జరుగుతుంది: మహేష్ కుమార్ గౌడ్
దేశ హితానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు
ప్రధానమంత్రిగా వ్యక్తిగత ప్రతిష్ఠకన్నా ..దేశ హితానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు డా. మన్మోహన్ సింగ్ అని వెల్లడించారు. రాజకీయాల్లో అరుదైన నిజాయితీకి, వినయానికి ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత దేశానికి ఆదర్శమని అన్నారు. ఆ మహనీయుని ఆలోచనలు, చేపట్టిన సంస్కరణలు, దేశాభివృద్ధికి వేసిన పునాదులు ఎన్నటికీ మరచిపోలేనివని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర
ఇక ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గాంధీ పేరును తొలగించినందుకు ఈనెల 28న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.

