Vakiti Srihari: మఖ్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన రైతుల కోరికను ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర మత్స్య, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు. సాయంత్రం నారాయణపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, భూముల సర్వే పూర్తి చేయడమే కాకుండా రైతులకు నష్టపరిహారం అందించి ప్రాజెక్టును ప్రారంభిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.
ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం
కృష్ణా నది నుండి కొడంగల్ వరకు సాగునీరు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నాలుగు దశల్లో నీటిని ఎత్తిపోసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలనలో ప్రజాధనం వృథా అయ్యేలా అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకున్నారని, కానీ తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్‌ను దేశ ప్రజలు ఎలా గుర్తుంచుకున్నారో, ఈ ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంతే ప్రేమతో గుర్తుంచుకుంటారని మంత్రి కొనియాడారు.
Also Read: Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి వాకిటి శ్రీహరి
రూ. 5.82 కోట్ల పరిహారం పంపిణీ
ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా మఖ్తల్ నియోజకవర్గంలోని కాచూవారు గ్రామంలో 40 మంది రైతులకు రూ. 2.80 కోట్లు, నారాయణపేట జిల్లా పేరపళ్ళ గ్రామంలో 30 మంది రైతులకు రూ. 1.48 కోట్లు, దామరగిద్ద మండలం బాపనపల్లిలో 32 మంది రైతులకు రూ. 1.51 కోట్లు చొప్పున పరిహారం అందించారు. మొత్తంగా 64 ఎకరాలకు సంబంధించి 102 మంది రైతులకు రూ. 5.82 కోట్ల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. పరిహారం అందుకున్న రైతులు మరోచోట వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్, మార్కెట్ చైర్మన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఆర్డీవో, ఇంజినీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.

