మహబూబ్ నగర్ స్వేచ్ఛ : Mahbubnagar News: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కే. ఎస్. రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రముఖ సాహితీవేత్త పల్లెర్ల రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని మొత్తం తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా అలంకరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లెర్ల రామ్మోహన్రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రముఖ కవి శ్రీశ్రీ అన్నట్లుగా ఈ దేశానికి కావాల్సింది పావన నవజీవన నిర్మాత లాంటి యువకులనీ, కానీ దురదృష్టవశాన ప్రస్తుతం దేశంలోనీ యువత మాదకద్రవ్యాలకు బానిసలై తమ స్వహస్తాలతో తమ బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారన్నారు.ప్రపంచంలో ఏ దేశానికి లేని అపురూపమైన మానవ వనరులు యువకుల రూపంలో భారతదేశంలో ఉన్నారన్నారు.
Also Read: Telugu states: ఉగాది వేళ ఇలా జరిగిందేంటి.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం!
వారందరినీ సన్మార్గంలో నడిపిస్తే ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఆవిష్కృతం అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు.యువతను ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ప్రముఖ పురోహితులు రాఘవేంద్ర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.ఎస్ రవికుమార్, డైరెక్టర్ వెంకట రామారావు ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు