Local Body Polls: కొత్త సంవత్సరంలోనే స్థానిక ఎన్నికలు?
మరింత ఆలస్యమవుతాయని నేతల్లో భావన
సుప్రీంలో పిటిషన్ డిస్మిస్ తర్వాత మొదలైన చర్చ
పార్టీ నేతల్లో అసంతృప్తి
హైకోర్టు గడువు వరకు వెయిటింగ్
కాంగ్రెస్ కు 42 శాతం రిజర్వేషన్ల టెన్షన్
అడ్వకేట్ జనరల్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
లీగల్ ఎక్స్ పర్ట్స్ తోనూ త్వరలో డిస్కషన్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Polls) మరిన్ని రోజులు వాయిదా పడే ఛాన్స్ ఉన్నదని కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువు, సుప్రీంకోర్టులో సర్కార్ పిటిషన్ డిస్మిస్ చేయడం వంటి పరిస్థితుల ఆధారంగా కొత్త సంవత్సరంలోనే ఎన్నికలు జరిగేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కోర్టులో విచారణలు, వాయిదాలు వంటివి రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి కొనసాగేలా ప్రభావం చూపుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నగారా మోగుతుందనుకున్న నేతల్లో, తాజాగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ డిస్మిస్ కావడంతో తీవ్ర నిరాశ, గందరగోళం నెలకొన్నది. ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ అంశంపై అన్ని రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, హైకోర్టు విధించిన గడువు వరకూ రాష్ట్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వం కూడా గడువు ముగిసేంతవరకూ ఎలాంటి హడావుడి లేకుండా, న్యాయపరమైన అంశాలపైనే దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేని పరిస్థితి మరో కొన్ని నెలలు పొడిగించే అవకాశం ఉందనే భావన నేతల్లో వ్యక్తమవుతోంది.
Read Also- Telangana Tourism: రామప్ప ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పాలి.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
పార్టీ నేతల్లో అసంతృప్తి…
ఎన్నికల ఆలస్యంపై అధికార పార్టీలోని స్థానిక నాయకులు, ముఖ్యంగా టికెట్ ఆశించే అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలా కాలంగా నియోజకవర్గాల్లో పట్టు కోసం, ప్రజా సంబంధాల కోసం కృషి చేస్తున్న వారికి, ఎన్నికల తేదీపై స్పష్టత లేకపోవడం నిరుత్సాహపరుస్తోంది.ఎప్పుడు ఎన్నికలొస్తాయో తెలియక ప్రజల్లోకి ఎలా వెళ్లాలో, ఏమని చెప్పాలో అర్థం కావడం లేదంటూ పలువురు నేతలు తమ ఇంటర్నల్ మీటింగ్స్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికైతేనే ప్రభుత్వ కార్యక్రమాలు గ్రౌండ్ లెవల్లో స్పష్టంగా అమలు జరుగుతాయని లీడర్లు చెప్తున్నారు. క్షేత్రస్థాయి లో పబ్లిక్ , పార్టీ కు మధ్య సత్సంబంధాలు ఏర్పడమే కాకుండా ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కూడా వెంటనే రిలీజ్ కానున్నాయి. ఎన్నికల డీలేతో ఈ అంశాలన్నింటికీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
Read Also- Amit Shah: మావోయిస్టుల కంచుకోటలపై కేంద్రమంత్రి అమిత్ షా కీలక ప్రకటన
కాంగ్రెస్‌కు రిజర్వేషన్ల టెన్షన్…? సీఎం వ్యూహం…
అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి కూడా స్థానిక ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలుగా మారింది.ముఖ్యంగా,రిజర్వేషన్ల అంశం పార్టీని టెన్షన్ పెడుతోంది. గతంలో ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన చిక్కులు ఎదురు అవుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓబీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో తలెత్తే న్యాయ వివాదాలను నివారించడం, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూడటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ రిజర్వేషన్ల సమస్య కారణంగానే ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చని కూడా కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. గురువారం అడ్వకేట్ జనరల్ తో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ తేదీ, న్యాయపరమైన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. హైకోర్టు గడువు లోపు తీసుకోవాల్సిన చర్యలు, సుప్రీంకోర్టు తీర్పు తదనంతర పరిణామాలపై లోతుగా విశ్లేషించారు. త్వరలోనే న్యాయ నిపుణుల (లీగల్ ఎక్స్‌పర్ట్స్) తోనూ ముఖ్యమంత్రి మరోసారి సమావేశమై, ఎన్నికల నిర్వహణపై తుది వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే న్యాయపరమైన అంశాలపై స్పష్టత వచ్చేవరకు, రాష్ట్రంలో ఈ అనిశ్చితి కొనసాగే అవకాశమున్నదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
