Panchayat Results: రెండో దశ ఫలితాలపై కేటీఆర్ వ్యాఖ్యలివే
KTR (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Panchayat Results: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Panchayat Results: తెలంగాణ రాష్ట్రంలో రెండవ దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఫలితాలు (Panchayat Results) కూడా అదే రోజు వెలువడ్డాయి. తొలి దశ ఎన్నికల మాదిరిగా రెండవ దశలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మొత్తం 4,332 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ (Congress) 2,331, బీఆర్ఎస్ (BRS) 1,195, బీజేపీ (BJP) 255, సీపీఎం (BJP) 34, స్వతంత్రులు 470 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన స్పందించారు.

గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు

రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తాచాటిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని, ఈ విషయాన్ని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబందహస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also- Lionel Messi: ఢిల్లీలో అడుగుపెట్టిన మెస్సీ.. ఒక్కసారి షేక్‌హ్యాండ్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఫీజు ఎంతంటే?

మారుతున్న రాజకీయ ముఖచిత్రం

ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే, కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని ఆరోపణలు చేశారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీకి ఇంతకన్నా ఘోరపరాభవం తప్పదని ఆయన పేర్కొన్నారు.

స్పష్టమైన సంకేతం

గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షంగా బీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, పల్లె పల్లెనా అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రంచేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివని అన్నారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం కాయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభివందనలు చేస్తున్నానని మాజీ మంత్రి పేర్కొన్నారు.

Read Also- Harish Rao: సిద్దిపేటలో ఫలించిన హరీష్ రావు వ్యూహం.. ఎక్కువ స్థానాల్లో గెలుపు!

Just In

01

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం

Panchayat Results: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Missterious: సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న “మిస్టీరియస్”