Land Cruiser Controversy:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో వివాదంలో (Land Cruiser Controversy) చిక్కుకున్నారు. ఆయన వాడుతున్న ల్యాండ్ క్రూయిజర్ కారు స్మగ్లర్ బసారత్ అహమద్ ఖాన్ అమ్మినదని వెల్లడైంది. దీంతో కేటీఆర్‌పై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తోందంటూ ఘాటైన విమర్శలు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కొంతకాలం క్రితం కారు స్మగ్లర్ బసారత్ అహమద్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో 8 కార్లను స్మగ్లింగ్ చేసినట్టు బసారత్ అహమద్ ఖాన్ వెల్లడించాడు. వాటి నెంబర్లను కూడా అధికారులకు చెప్పాడు. కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూయిజర్ (నెంబర్ టీఎస్09డీ 6666) తాను అమ్మినదేనని చెప్పాడు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆర్టీఏ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించారు. దీంట్లో కేటీఆర్ వాడుతున్న కారు ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిష్టర్ అయినట్టుగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థతో కేటీఆర్‌కు ఉన్న లింకులు ఏమిటి? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్మగ్లర్ అమ్మిన కారు అని తెలిసి కూడా కేటీఆర్ దానిని వాడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బండి సంజయ్ హాట్ కామెంట్స్…
ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన కార్లపై నడుస్తోందా? అని ప్రశ్నించారు. లగ్జరీ కార్ల స్మగ్లర్ బసారత్ అహమద్ ఖాన్ తెచ్చిన ల్యాండ్ క్రూయిజర్ కారులో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన కంపెనీల పేర్లతో ఈ కార్లు ఎందుకు? రిజిష్టర్ అయ్యాయని ప్రశ్నించారు. మార్కెట్ ధర చెల్లించారా? తక్కువ ధరకు కొన్నారా? అని నిలదీశారు. పేమెంట్లు బినామీ పేర్లతో చేశారా?, అక్రమ సంపాదన నుంచి చెల్లించారా?, మనీ లాండరింగ్ ద్వారా ఇచ్చారా? అన్నది స్పష్టం చేయాలన్నారు. సంబంధిత శాఖలు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజానిజాలను బయటకు తీయాలని డిమాండ్ చేశారు.
Read Also- Bathukamma Kunta: 5న బతుకమ్మకుంట గ్రాండ్ ఓపెనింగ్. రూ.7.40 కోట్లతో అభివృద్ధి
24న బతుకమ్మ సంబరాల్లో కేటీఆర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఈ నెల 24న సాయంత్రం 4 గంటల నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నేతలు వెల్లడించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నట్లు, ఈ సంబరాలకు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలివస్తారని బీఆర్ఎస్ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ బతుకమ్మ సంబరాల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సోమవారం తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, నగర ఎమ్మెల్యేలు, పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పీపుల్స్ ప్లాజాలో జరిగే ఈ కార్యక్రమానికి భారీగా మహిళలను తరలించేందుకు కృషి చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత పదేళ్ల పాటు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వ అధికారికంగా నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి పార్టీ ఆధ్వర్యంలోనే బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బీఆర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదో నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.