KTR on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR) వెంట్రుక కూడ పీకలేరని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన నేపథ్యంలో బీఆర్కే భవన్ (BRK Bhavan) వద్దకు కేటీఆర్ పార్టీ శ్రేణులతో తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అంటే ఒక చరిత్రన్న కేటీఆర్.. ఆయన్ను విచారణకు పిలిచారంటే హనుమంతుడి ముందు గుప్పిగంతులు వేసినట్లేనని అన్నారు.
అంతిమంగా ధర్మానిదే విజయం
నీటిపారుదల శాఖపై కేసీఆర్ కు ఉన్నంత అవగాహన భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram)పై కాంగ్రెస్ పార్టీ (Congress Party) దుష్ప్రచారం చేస్తోందని.. అంతిమంగా ధర్మము, న్యాయానిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేటీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం రేవంత్ రాష్ట్రాన్ని కూల్చడానికి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌ను వదిలిపెట్టం
రాజకీయ వేధింపులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప.. సీఎం రేవంత్ రెడ్డికి మరొకటి తెలియదని కేటీఆర్ అన్నారు. వంద జన్మలు ఎత్తినా కేసీఆర్ గొప్పతనం ఆయనకు అర్థం కాదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. వారిని రాష్ట్రం నుంచి తరిమేశాడని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని.. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు.
Also Read: Rahul Gandhi Letter: విద్యార్థులకు అండగ రాహుల్.. ప్రధానికి బహిరంగ లేఖ.. వైఫల్యాలపై నిలదీత!
కాళేశ్వరం పేరుతో డ్రామాలు
ఆరు గ్యారంటీలు, 420 హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదిస్తూనే ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ కు కేబినేట్ (Telangana Cabinet) అంటే అర్థం కూడా తెలియదని.. మంత్రి వర్గ పనితీరుపై కూడా అవగాహన లేదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కంటే సీఎంకు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మారిపోయాయని విమర్శించారు. కాళేశ్వరం (Kaleshwaram Project), ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping), ఈ-ఫార్మూలా (Formula E Race) పేర్లతో డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.