KTR: తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పనిచేశానే కానీ, ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా ఈ రేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy) పారిపోయారని విమర్శించారు. ఏసీబీ (ACB) విచారణ తర్వాత తెలంగాణ భవన్‌లో కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తానంటే రావడానికి సీఎం రేవంత్ రెడ్డికి ( Revanth Reddy) ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.
మొదటి సంవత్సరం ఫార్ములా రేసు విజయవంతం కావడంతో రెండో సంవత్సరం కూడా ఎలాగైనా హైదరాబాద్ ( Hyderabad) లోనే నిర్వహించాలని బీఆర్ఎస్ (Brs) ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని అందులో భాగంగానే, నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని తెలిపారు.ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.
అసలు కరప్షనే జరగని ఓ తుపేల్ కేసులో ఏసీబీని ఇన్వాల్వ్ చేయడాన్ని తన 26ఏళ్ల కెరీర్‌లో చూడనే లేదని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ (IPS Praveen Kumar) చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. చిట్టినాయుడు రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే పొద్దుటి నుంచి అటుతిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు అడిగారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్ చేయాలని ఒత్తిడి ఉంటే బేషుగ్గా చేసుకోవచ్చని అధికారులకు చెప్పానన్నారు. అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్దమన్నారు. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేవారు ఎవరూ బీఆర్ఎస్‌లో (BRS) లేరన్నారు.
Also Read: HYDRA Commissioner: ప్రజావసరాల స్థలాలను కాపాడుతున్నాం.. రంగనాథ్ స్పష్టం!
డబ్బుల సంచులతో అడ్డంగా దొరికి
50 లక్షల డబ్బుల బ్యాగుతో అడ్డంగా దొరికి నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి, (Revanth Reddy) తమను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలన్న శాడిస్ట్ ఆలోచనతో ఉన్నారని కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్ రావును (Harish Rao) కాళేశ్వరం కమిషన్ ముందుకు, తనను ఏసీబీ విచారణకు పిలుస్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ (Congress) నేతలకు పరిపాలన చేతకాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదని విమర్శించారు.
దద్దమ్మ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారిందన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పెడితే ఒక 15 రోజులు తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడన్నారు. తనపై 14 కేసులు పెట్టావు, ఇంకా 14000 కేసులు పెట్టుకోవాలన్నారు.
2019 జూన్ 21న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ( KTR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleswaram Project) జాతికి అంకితం చేసి ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకులను ఫుట్‌బాల్ ఆడి చిత్తుచిత్తుగా ఓడించడంపై బీఆర్ఎస్ (BRS) నాయకులు దృష్టి పెట్టాలని కోరారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..
తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పరిపాలన చేతకాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నోటీసుల పేరుతో నాటకాలు ఆడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడన్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ (HMDA) అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సాధికారికంగా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్‌లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు తనకు పంపించాడన్నారు.
హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఎంతగానో పేరు తీసుకువచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)అన్నారు. ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్న 44 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం ఉద్దేశాపూర్వకంగా పక్కనపెట్టి, నోటీసుల పేరుతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేశారన్నారు. తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన, విచారణ పేరుతో సాగదీసినా ఫార్ములా ఈ అంశం సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు.
Also Read: Mahabubabad: అక్రమ కేసులు ఎత్తివేయాలి.. నల్ల చట్టాలను రద్దు చేయాలి!