KTR Appears for ACB Inquiry: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన విచారణ 7 గంటల పాటు సాగింది. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చెల్లింపులపై అధికారుల బృందం విచారించినట్టు సమాచారం. క్రిప్టో కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లింపులు చేశారని ప్రశ్నించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ( BRS) ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకొని ఫార్ములా ఈ కార్ రేస్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనివల్ల హైదరాబాద్‌కు ( Hyderabad) అంతర్జాతీయ గుర్తింపు దక్కడంతోపాటు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ (KTR) తోపాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు.
క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి
కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ కార్ రేస్ ఒక సెషన్ జరిగింది. ఆ తర్వాత స్పాన్సర్ గ్రీన్ కో కంపెనీ ఒప్పందం నుంచి తప్పుకున్నది. దాంతో హెచ్ఎండీఏ (HMDA) కార్ రేస్ కంపెనీ ఎఫ్ఈవోకు రెండో సెషన్ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా రూ.55కోట్ల చెల్లించింది. అయితే, దీంట్లో నిబంధనలను ఏమాత్రం పాటించలేదు. నిజానికి ఈ చెల్లింపులు జరిగినప్పుడు ఎన్నికలు కోడ్ అమలులో ఉంది. అలాంటప్పుడు చెల్లింపులు జరుపడానికి అనుమతులు తీసుకోవాలి. అయితే, ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇక, చెల్లింపులు జరుపడానికి క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా అదీ చెయ్యలేదు. పైగా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండా విదేశీ మారక ద్రవ్య రూపంలో చెల్లింపులు చేశారు.
నిబంధనల ప్రకారం రూ.19కోట్ల కన్నా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ (ACB) విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏసీబీ ( ACB) కేసులు నమోదు చేసి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ అధికారి బీఎల్ఎన్ రెడ్డి తదితరులను నిందితులుగా నమోదు చేసింది. ఈ క్రమంలో గతంలో ఒకసారి కేటీఆర్‌ను ( KTR) విచారించిన ఏసీబీ ( ACB) అధికారులు తాజాగా సోమవారం మరోసారి విచారణకు రావాలని ఇటీవల కేటీఆర్‌కు (KTR) నోటీస్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ (KTR) మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
Also Read: HYDRA Commissioner: ప్రజావసరాల స్థలాలను కాపాడుతున్నాం.. రంగనాథ్ స్పష్టం!
నిబంధనలు ఎందుకు పాటించలేదు
ఎఫ్ఈవోకు చేసిన చెల్లింపుల్లో ఎందుకు నిబంధనలు పాటించలేదు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఎందుకు తీసుకోలేదని అధికారుల బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. చెల్లింపులు జరపాలని తాను చెప్పింది నిజమే అని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. అయితే, నిబంధనల గురించి తనకు తెలియదని అన్నట్టు సమాచారం. వీటి గురించి అధికారులకే తెలుస్తుంది అని చెప్పినట్లు తెలిసింది. ఇక, రేస్ నిర్వహణలో ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీని ఎందుకు చేర్చారు, వారి నుంచి ఎంత ఆదాయం వచ్చిందన్న ప్రశ్నకు ఆ వివరాలు తనకు తెలియవని జవాబు ఇచ్చినట్టు సమాచారం. అయిట్ల, ఈ కంపెనీకి సంబంధించి ఏసీబీ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.
కేవలం 2 లక్షల క్యాపిటల్ ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి బాధ్యతలు ఎలా ఇచ్చారు, ట్రై పార్టీ ఒప్పందానికి కేవలం 4 నెలల ముందు ఏర్పాటైన కంపెనీని ఒప్పందంలో ఎలా చేర్చుకున్నారని అడిగినట్టు తెలిసింది. ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.49 కోట్లు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించినట్టు సమాచారం. అంటే క్విడ్ ప్రోకో జరిగినందునే ఆ కంపెనీని ఒప్పందంలో చేర్చారా అని ప్రశ్నించినట్టు తెలిసింది. వీటికి కేటీఆర్ సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. తాము చేసిన చెల్లింపులకు సంబంధించిన నగదు ఎఫ్ఈవో కంపెనీ వద్ద ఉందని, దానిని తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పినట్టు తెలిసింది. దీంతో అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను పంపించినట్లు సమాచారం.
Also Read: Harish Rao: రేవంత్ సర్కార్‌లో.. ప్రశ్నార్థకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు!
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
ఇదిలా ఉండగా విచారణ కోసం కేటీఆర్ (KTR) వచ్చినపుడు ఏసీబీ ( ACB) ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విచారణకు వచ్చే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ( KTR) తనను అరెస్ట్ చేస్తారేమో అని ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. దాంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఏసీబీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఏసీబీ (ACB) ఆఫీస్ ఉన్న రోడ్డులోనే ఉన్న ఐసీసీసీ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) క్యాబినెట్ సమావేశం ఉండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, దీనిని ముందుగానే ఊహించిన పోలీస్ (Police) ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదుల సంఖ్యలో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సెల్‌ఫోన్ అప్పగించండి
ఫార్ములా ఈ కార్ రేస్ లో సోమవారం కేటీఆర్ ( KTR) ను సుధీర్ఘంగా విచారించిన ఏసీబీ (ACB) అధికారులు సెల్ ఫోన్ ను అప్పగించాలని సూచించినట్టు తెలిసింది. 2021-24 మధ్య ఉపయోగించిన మొబైల్‌ను ఈనెల 18లోపు అందచేయాలని చెప్పినట్టు సమాచారం. ఈ సెల్ ఫోన్ డాటాను విశ్లేషిస్తే ఈ కార్ రేస్ కు సంబంధించి కీలక వివరాలు వెల్లడి కాగలవని అధికారులు భావిస్తున్నారు.
Also Read: GHMC: వర్క్ ఏదైన డీసీలు జడ్సీల ప్రమేయం ఉండేలా చర్యలు!