Komati Reddy Venkat Reddy: ప్రభుత్వాసుపత్రుల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. టిమ్స్, ఉస్మానియా దవాఖాన్లను అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంగళవారం ఆయన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టిమ్స్ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేయాలన్నారు. దీని వలన పేదలకు వైద్యం సులువుగా అందుతుందన్నారు. ప్రాణాలు కాపాడే ఆసుపత్రుల నిర్మాణాలన్నీ పటిష్టంగా ఉండాలన్నారు. నాణ్యతలో ఎక్కడా లోపాలు రాకూడదని సూచించారు.
హాస్పిటల్ అంటే పేదలకు గుడి కట్టించి ఇచ్చినట్లేనని వెల్లడించారు. టిమ్స్ పూర్తయితే పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందన్నారు. పేద, మధ్య తరగతి, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రైవేట్ భారం తప్పుతుందన్నారు. ఇక ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రి మూత పడిందని, దీంతో గాంధీకి పేషెంట్ల తాకిడి పెరిగిందన్నారు.
Also read: Sudigali Sudheer: అదిరిపోయే న్యూస్ చెప్పిన సుధీర్ ఫ్యామిలీ.. త్వరలో మనకి పరిచయం చేయబోతున్నాడా?
ఉస్మానియా పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారన్నారు. ఉస్మానియా హాస్పిటల్ పునర్ నిర్మాణం డీపీఆర్ త్వరలో సీఎం దృష్టికి తీసుకువెళ్లి కెబినేట్ ఆమోదం పొందుతుందన్నారు. టిమ్స్ నాలుగు మల్టీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రత్యేకంగా న్యూరో, గ్యాస్ట్రో, హార్ట్ విభాగాలుగా నిర్మించాల్సి ఉన్నదన్నారు.
సనత్ నగర్ ఆసుపత్రి పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానుండగా, ఎల్బీనగర్, అల్వాల్ ఆసుపత్రులు తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతి వారం ఆసుపత్రుల స్టేటస్ పై రివ్యూ చేస్తానని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమం లో హెల్త్ సెక్రటరి క్రిస్టినా జెడ్ చొంగ్తూ తదితరులు ఉన్నారు.