Kishan Reddy: తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ (BJP) అధికారంలోకి రావాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తొలుత జాతీయ కాంగ్రెస్ పాలన, రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విరుచుకు పడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఉగ్రవాదులు వందల మందిని క్రూరంగా చంపారని గుర్తుచేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతుల్లో వందలమంది చనిపోతే కాంగ్రెస్ ఏనాడు స్పందించలేదని విమర్శించారు. మన సైనికులని చంపితే.. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలని సర్జికల్ స్ట్రైక్ పేరుతో ధ్వంసం చేశామని అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్ట్ లని చంపితే.. సింధూర్ పేరుతో దాడులు చేశామని పేర్కొన్నారు.
మమ్మల్ని అనండి.. సైన్యాన్ని కాదు
పాకిస్థాన్ ఒక్క బాంబ్ వేస్తే.. తాము వంద బాంబ్ లు వేస్తామని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ.. దమ్ముంటే తమని విమర్శించాలని.. సైనికులను కాదని సూచించారు. కాంగ్రెస్ చేసే విమర్శలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని కిషన్ రెడ్డి అన్నారు. ఈవీఎం లని ట్యాంపరింగ్ చేస్తే.. తెలంగాణ లో కాంగ్రెస్ ఎట్లా గెలిచిందని నిలదీశారు. కుక్క తోక వంకర అన్నట్లు.. రాహుల్ గాంధీ వంకరేనని కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు బీజేపీ కి ఎదురేలేదని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ 11 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సోషల్ మీడియా విభాగానికి కిషన్ రెడ్డి సూచించారు.
ఈటలకు తెలిసిందే చెప్పారు
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైనా కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలని పేర్కొన్నారు. తెలంగాణను రక్షించే పార్టీ బీజేపీ.. అని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ప్రజలకి ఇచ్చినా హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అసెంబ్లీపై ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట ఈటల తెలిసిందే చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలని ప్రశ్నించాడు కాబట్టే ఈటెల బయటికి వచ్చాడని గుర్తుచేశారు.
Also Read: Vivian Jenna Wilson: ట్రంప్‌తో వివాదం.. ఎలాన్ మస్క్ కూతురు షాకింగ్ కామెంట్స్!
సీఎం రేవంత్‌కు సూటి ప్రశ్న
ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటివరకూ ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. మరోవైపు కాళేశ్వరంపై బుకాయిస్తున్న బీఆర్ఎస్ పార్టీపైనా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project) క్రాక్ అయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. NDSA రిపోర్ట్ తప్పు ఏ విధంగా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై CBI దర్యాప్తు జరగాలని పట్టుబట్టారు. కాళేశ్వరం అవినీతి అక్రమాలు బయటికి రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలి. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకి ఎంత వరకు పనికొచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.