Penuballi Land Scam: W.P. No.1174/2021గా తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో ప్రభుత్వం తరఫున దాఖలైన కౌంటర్ అఫిడవిట్ కీలక వాస్తవాలను దాచిపెట్టిందన్న ఆరోపణలతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక ఫైళ్లు, నివేదికలు ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా మాత్రమే ఆలస్యంగా వెలుగులోకి రావడం అనుమానాలకు మరింత బలం చేకూర్చిందని గ్రామస్తులు అంటున్నారు. బాధ్యత వహించాల్సిన ఒక సీనియర్ అసిస్టెంట్‌పై తక్షణ చర్యలు తీసుకుని, ఫ్రెష్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, అలాగే ఆయన్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైకోర్టు కేసులోనే నిజాల దాచివేత?
ఖమ్మం(Khammam) జిల్లా, సత్తుపల్లి(Sathupally) మండలం, కొమ్మేపల్లి గ్రామానికి చెందిన సింగరేణి జేవీఆర్ ఓసి–2 భూ నిర్వాసితుల కోసం మంజూరు చేయబడిన ఆర్&ఆర్ ప్యాకేజీల అంశం రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీస్తోంది. కొమ్మేపల్లి గ్రామంలో భూ నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షల నష్టపరిహారంతో పాటు 0–02 కుంటల ఇండ్ల స్థలాన్ని మంజూరు చేసే క్రమంలో ఆర్&ఆర్ సెంటర్ అయ్యగారిపేటలో 244 ఇండ్ల స్థలాలు మంజూరు చేశారు. మొదటి విడతగా 2018లో 229 మందికి నష్టపరిహారం చెల్లించి, ఒక్కొక్కరికి 0–02 కుంటల ఇండ్ల స్థలాలను కేటాయించగా, మిగిలిన 15 ఇండ్ల స్థలాల కేటాయింపుల కోసం అర్హుల ఎంపిక జరగాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా ఆర్&ఆర్ ప్యాకేజీ పొందాలని ప్రయత్నించిన 12 మందిని సత్తుపల్లి మండల తహశీల్దార్ 2016లోనే అనర్హులుగా గుర్తించి తొలగించారని, ఆ సమయంలో రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆ 12 మందిని మళ్లీ ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరగగా గ్రామ యువకులు అభ్యంతరాలు తెలపడంతో ఆ ఎంపిక ప్రక్రియ నిలిచిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. అదే సమయంలో అర్హులైన కొందరు యువతుల ఎంపికలో రెవెన్యూ అధికారులు అవసరమైన ఆధారాల సేకరణలో జాప్యం చేయడంతో వారి ఎంపిక ప్రక్రియ నేటికీ పెండింగ్‌లోనే ఉందని పేర్కొన్నారు.
2016 పి.ఏ.ఎఫ్ జాబితా ప్రకారం
ఈ నేపథ్యంలో పిటిషనర్లుగా ఉన్న 12 మంది తమ అర్హత పునఃపరిశీలన కోసం 26-08-2020న దరఖాస్తు చేయగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో స్థాయిలో విచారణ జరిగింది. 31-12-2020న సమర్పించిన విచారణ నివేదికలో ఆ 12 మంది పిటిషనర్లు కొమ్మేపల్లి గ్రామానికి చెందినవారు కాదని, ఆర్&ఆర్ ప్రయోజనాలకు అర్హులు కాదని స్పష్టంగా తేలిందని గ్రామస్తులు చెబుతున్నారు. 2016 పి.ఏ.ఎఫ్ జాబితా ప్రకారం కోర్టు కేసులో ఉన్న 12 మందిలో 6 మంది అప్పటికే ఆ జాబితా నుంచి తొలగించబడినవారిగా, మరో 6 మంది అసలు ఆ జాబితాలోనే లేరని అధికారికంగా నిర్ధారణ అయినప్పటికీ, ఈ కీలక అంశాలను ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించకుండా పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చేలా కృషి చేస్తున్నాడని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల మాటల్లో, ఈ నివేదికలు మరియు ఫైళ్లు ఆర్టీఐ ద్వారా పొందిన తర్వాతే ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనీ, ఆ నివేదికలను అప్పుడే హైకోర్టు ముందు ఉంచి ఉంటే కేసు దిశ పూర్తిగా మారిపోయేదని, కోర్టులో కూడా వారు అనర్హులుగా గుర్తించబడేవారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: India Bullet Train: దేశంలో బుల్లెట్ రైలు కల నెరవేరబోతోంది.. ప్రారంభం తేదీని ఖరారు చేసిన కేంద్రం
సీనియర్ అసిస్టెంట్ కారణంగా..
కౌంటర్ అఫిడవిట్‌లో ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వదిలేయడం వల్ల న్యాయ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తూ, నేటికీ W.P. No.1174/2021 కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా వాస్తవ ఆధారాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఇంత అన్యాయానికి ఒడిగట్టిన సీనియర్ అసిస్టెంట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కల్లూరు సబ్–కలెక్టర్‌కు పిర్యాదు చేశామని గ్రామస్తులు పేర్కొన్నారు. అంతేకాకుండా, అసలైన ఆర్&ఆర్ ప్యాకేజీకి అర్హులైన యువతులు తమ ఎంపిక ఫైళ్ల విషయంలో సదరు సీనియర్ అసిస్టెంట్ కారణంగా గత ఏడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయం గురించి కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు జనవరిలో ఫిర్యాదు చేశారనీ, ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని ఆర్డీవో / సబ్–కలెక్టర్ కార్యాలయం కల్లూరుకు మార్చి 2025లో ఆదేశాలు జారీ అయినప్పటికీ, నేటికీ సంబంధిత ఫైళ్లు అదే సీనియర్ అసిస్టెంట్ సెక్షన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘అన్నీ నా చేతుల్లోనే’ అన్న ధోరణితో వ్యవహరిస్తూ అర్హులైన యువతులను అనర్హులుగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్&ఆర్ కాలనీలో అక్రమ కబ్జాలు – నోచుకోని విచారణ?
ఇదే సీనియర్ అసిస్టెంట్ అండ ఉందనే ధైర్యంతో W.P. No.1174/2021లోని 12 మంది పిటిషనర్లు కొమ్మేపల్లి ఆర్&ఆర్ సెంటర్‌లో ఇండ్ల స్థలాలను అక్రమంగా కబ్జా చేశారని గ్రామస్తులు మరో తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు సమగ్ర విచారణ జరగలేదని, కబ్జా చేసిన స్థలాలను రికవరీ చేయకుండా వారికే సహకరిస్తున్నారని వారు వాపోతున్నారు.
గ్రామస్తుల డిమాండ్లు
* కొమ్మేపల్లి, లింగపాలెం రెండింటికీ సంబంధించి దాఖలైన అన్ని ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్‌లపై సమగ్ర విచారణ
* నిజాలను వక్రీకరించారా లేదా అన్నదానిపై నిష్పక్షపాత విచారణ పూర్తయ్యే వరకు సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలి
* హైకోర్టులో ఫ్రెష్, ట్రూత్‌ఫుల్ కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలి
* ఆర్.ఎండ్.ఆర్ ప్యాకేజీకి అర్హులైన వారిని సబ్-కలెక్టర్ తక్షణమే గుర్తించాలి
* అసలైన రైతులు, భూ నిర్వాసితులకు రావాల్సిన భూమి–చెట్ల నష్టపరిహారాలు వెంటనే విడుదల చేయాలి
ఈ రెండు గ్రామాల సమస్యే ఇలా ఉంటే మిగతా భూసేకరణ కోర్టు కేసులో పిటిషనర్లతో లాలూచీ పడి ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టించుంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ “ఇది ఒక్క లింగపాలెం లేదా కొమ్మేపల్లి సమస్యే కాదు… కోర్టుల ముందు ప్రభుత్వ నిజాయితీకి సంబంధించిన విషయం” అని నియోజక వర్గ ప్రజానీకం పదేపదే మొత్తుకుంటుంది.
Also Read: Kawasaki Z650RS: భారత్‌లో లాంచ్ అయిన కవాసాకి Z650RS.. E20 ఫ్యూయల్ సపోర్ట్‌తో

