Urea Shortage: ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులందరికీ సరిపోయే యూరియాను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామానికి జిల్లా రైతు సంఘం నాయకులు మల్లెంపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం కామేపల్లిలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వానాకాలం సీజన్ కంటే ముందే రైతులు సాగు చేసే పంటల విస్తీర్ణం అంచనా వేసి, సరిపడా యూరియాను అందించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితోనే యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అన్నదాతలకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా సంబంధిత ఉన్నతాధికారులు ప్రకటించినా యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కొరివి మోహన్ రావు,మల్లెంపాటి బసవయ్య,ముత్తిబోయిన రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ లో ఉదయం 6 గంటల నుంచే
మహబూబాద్ పట్టణ కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచి రైతులు పిఎసిఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్లు కట్టారు. లారీలో నుండి యూరియా దిగుమతి చేసేంతవరకు టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి పూర్తి బందోబస్తు చర్యలను చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కావాల్సిన వసతులన్నింటిని కల్పించారు. క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ యూరియా పంపిణీ సమయంలో రైతులకు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.