Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్(Justice P.C. Ghosh Commission) ఇచ్చిన నివేదికను కొట్టి వేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ను నియమించి దానిపై న్యాయ విచారణ జరిపించిన విషయం తెలిసిందే. 115మందిని ఓపెన్ కోర్టులో విచారించటంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న పలువురు ఇంజనీర్లు, అధికారుల నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు తీసుకున్న కమిషన్ గతనెల 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ఈ నివేదికను కొట్టి వేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి వాటిపై హైకోర్టు ఛీఫ్ జస్టిస్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. కేసీఆర్(KCR) తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదికను రూపొందించిందని చెప్పారు.
అసెంబ్లీలో చర్చ జరిగేలా..
ఇదంతా కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా జరిగినట్టుగా అనిపిస్తోందన్నారు. వేర్వేరు కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) లోని ఒక పిల్లర్ కుంగిపోయినట్టు చెప్పారు. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నివేదిక కాపీలను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇవ్వకుండా మీడియాకు అంద చేయటంలో దురుద్దేశ్యం కనిపిస్తోందన్నారు. జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ నిబంధనలను పాటించ లేదని చెప్పారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952 సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వకుండానే నివేదికను విడుదల చేశారన్నారు. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిందని చెప్పారు. ఇక, నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగేలా కాంగ్రెస ప్రణాళిక రూపొందించిందన్నారు. దీనిపై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పిటిషనర్లు కేసీఆర్(KCR), హరీష్ రావు(harish Rao) అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు అలాంటపుడు నివేదికను ఎందుకు బయట పెట్టారని ప్రశ్నించింది. ఆ వెంటనే కేసీఆర్ తరపు న్యాయవాది సుందరం మీడియా సమావేశాన్ని పెట్టి మరీ ప్రతీ జర్నలిస్టుకు అరవై పేజీల నివేదికను కూడా అందించారని చెప్పారు.
Also Read: New GST Rates: కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే.. ధరలు తగ్గే వస్తువులు ఇవే
నివేదిక ఆధారంగా విడుదల చేశారా?
ఇక, కోర్టుకు ఇచ్చిన నివేదిక కాపీలు సరిగ్గా కనిపించటం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సరిగ్గా కనిపించేలా నివేదిక కాపీలు ఇస్తే తరువాత విచారణ చేస్తామని పేర్కంది. అయితే, కేసు ప్రాధాన్యత దృష్ట్యా ఇవాళే విచారణ కొనసాగించాలని న్యాయవాది సుందరం విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కాళేశ్వరంపై నివేదికను జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా విడుదల చేశారా? అని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. నివేదిక కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా?…పిటిషనర్లకు 8బీ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చారా? లేదా?…నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి? అని అడిగింది. దీనికి అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ తాము నోటీస్ ఇచ్చినట్టు చెప్పారు. దానిపై సెక్షన్ ను మెన్షన్ చేయనంత మాత్రానా అది 8బీ నోటీస్ కాదంటే ఎలా? అని అన్నారు. నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే అని అన్నారు. ఇక, కాళేశ్వరం(Kaleshwaram)పై కమిషన్ ఇచ్చిన నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాతే పెడతామన్నారు. కేసు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్ఓ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిగిన తరువాత తదుపరి విచారణ జరపాలన్నారు.
అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాత
కాగా, సెక్షన్ 8బీ ప్రకారం కాకుండా ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజా ధనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కమిషన్ ను నియమించిందని చెప్పిన అడ్వకేట్ జనరల్ కేబినెట్ సులభంగా అర్థం చేసుకునేందుకుగాను అరవై పేజీల నివేదికను తయారు చేశారని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును కేబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాత తదుపరి చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగే వరకు దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ చేయ వద్దని కోరారు. పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయటానికి గడువు కావాలని అడిగారు. సెక్షన్ 8బీ ప్రకారం నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్లు తప్పు పట్టటం చెల్లదన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు పెట్టనున్నారు? అని ప్రశ్నించింది. ఈ నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అని అడిగింది.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ పాతబస్తీ.. ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ.. సీఎం రేవంత్