Kavitha – CM Revanth Reddy: తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ – 1 పరీక్ష నిర్వహించడంలో నిర్వక్ష్యం వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయని అన్నారు. గ్రూప్ – 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు.
తొలి నుంచి సందేహాలు
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్ టికెట్ ఇష్యూ చేసిన టీజీపీఎస్సీ అధికారులు, మెయిన్స్ పరీక్షకు వేరే హాల్ టికెట్ జారీ చేసినట్లు కవిత అన్నారు. సాధారణంగా ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు అదే హాల్ టికెట్ నంబర్ తో మెయిన్స్ పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. కొత్తగా జారీ చేసిన హాల్ టికెట్లతో మెయిన్స్ నిర్వహించడంపై తొలి నుంచి అనేక సందేహాలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కవిత అన్నారు. వాటిని నివృత్తి చేయకుండానే మెయిన్స్ పరీక్షల తంతు ముగించడాన్ని ఆమె తప్పుబట్టారు.
ఆ 10 మంది ఎవరు?
టీజీపీఎస్సీ 563 పోస్టులకు గాను ప్రిలిమ్స్ నిర్వహించగా. అందులో క్వాలిఫై అయిన వారిని 1 : 50 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేసింది. అయితే మెయిన్స్ కు 21,075 మంది హాజరయ్యారని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించిందని.. రిజల్ట్స్ తర్వాత ఆ సంఖ్య 21,085 మందికి చేరిందని కవిత ఆరోపించారు. ఆ పది మంది ఎలా పెరిగారని బహిరంగ లేఖలో నిలదీశారు. ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్షకు హాజరయ్యారని మొదట చెప్పిన టీజీపీఎస్సీ ఆ తర్వాత ఆ సంఖ్యను 10కి పెంచిందని ఆరోపించారు. అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు ఈ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి? అని ప్రశ్నించారు.
Also Read: Twist In MMTS Case: రేప్ కాదు రీల్స్ కోసమే.. ఎంఎంటీఎస్ ఘటనపై విస్తుపోయే వాస్తవాలు!
ఆ 71 మందిపై అనుమానం
రెండు పరీక్ష కేంద్రాల నుంచి 71 మంది అభ్యర్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంపైనా కవిత అనుమానం వ్యక్తం చేశారు. వారంతా రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన వారు కావడంపై మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో నెలకొన్న అనేక సందేహాల నేపథ్యంలో గ్రూప్ -1 నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని సీఎ రేవంత్ రెడ్డికి కవిత విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.