Kavitha Vs Mahesh Goud: పొలిటికల్ పార్టీని నిర్మించుకునే ప్రక్రియలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) రాజకీయ వ్యాఖ్యల డోస్ పెంచారు. అధికార కాంగ్రెస్‌తో (Congress) పాటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే వద్దన్నామంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై కవిత (Kavitha Vs Mahesh Goud) స్పందించారు. జాగృతిలో చేరితే అనుభవం రీత్యా మహేష్ కుమార్ గౌడ్‌కి మంచి పోస్ట్ ఇస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు.. నేను కాంగ్రెస్‌లోకి వస్తానంటే వద్దన్నడట. అన్నా కాంగ్రెస్ పార్టీలో ఏం లేదు. అది ఓడిపోయే పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ రాదు. తెలంగాణలో మా జాగృతి పార్టీయే గెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్‌నే నేను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నాం. మీకున్న అనుభవంతో మీకు మంచి పోస్టు ఇస్తాం. నేషనల్ కన్వీనర్ లాంటి పోస్టు ఇస్తాం. మీరే రండి. మేము చాలా సిరీయస్ పొలిటికల్ పార్టీగా, చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయవల్ల తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతాం. కాబట్టి, మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చెయ్యొద్దు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాననడం, మీరు వద్దనడం.. ఇవన్నీ మీకేమైనా కల వచ్చిందేమో అన్నా. జర చూపించుకోండి. బొట్టుగిట్టు పెట్టించుకోండి. ఇటువంటి ప్రయత్నాలతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయవద్దు. మేము మంచిగా మా పార్టీని, విధివిధానాలను తయారు చేసుకుంటున్నాం. మేము ఎవరికోసమో ఎదురుచూడం. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ముందడుగు వేస్తాం. ఇటీవంటి ప్రయత్నాలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను’’ అని కవిత అన్నారు. తాను కాంగ్రెస్‌లోకి వస్తానంటే వద్దని మహేష్ కుమార్ గౌడ్ చిట్‌చాట్‌లో చెప్పినట్టు తాను విన్నానని, తాను ఆ బైట్ చూడలేదని ఆమె పేర్కొన్నారు.
Read Also- Huzurabad Hockey Players: జాతీయ హాకీ బరిలో హుజురాబాద్ విద్యార్థులు ఎంపిక..?
మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు?
కాంగ్రెస్‌లో చేరేందుకు కవిత ఆసక్తిచూపుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. కవిత తమ పార్టీలో చేరుతానని అంటున్నారని, ఆమె తరపున ప్రతిపాదనలు వస్తున్నాయని, కానీ, ఆమె కంటే సమర్థవంతమైన నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆయన చెప్పారు. కవిత చేరికను తానే వద్దంటున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్‌లో ఆమె కంటే ఎంతోమంది శక్తివంతులు, సమర్థవంతమైన నాయకులు, నేతలు ఉన్నారని పేర్కొన్నారు. ఆమె కంటే మెరుగైన నాయకత్వం తమ వద్ద ఉందని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకించిన నడుచుకున్నవారిని చేర్చుకుని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసుకోబోమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

