Kavitha Kalvakuntla: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో కేసీఆర్ కు పరోక్షంగా చురకలు అంటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండటాన్ని కవిత తప్పుబట్టారు. కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టకపోతే.. బీఆర్ఎస్ ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు – రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరు అందించలేదని విమర్శించారు. గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే ధోరణిని అవలంభిస్తోందని మండిపడ్డారు.
హరీశ్ రావుపై ఫైర్..
మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని.. బబుల్ షూటర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని మోసం చేసి అక్రమాలకు పాల్పడిన హరీశ్ రావుకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పాలమూరును ప్యాకేజీకి అమ్ముకున్న వ్యక్తి హరీశ్ రావంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పిల్ల కాకులకు అసెంబ్లీలో బాధ్యతలు ఇవ్వడమేంటని పరోక్షంగా కేసీఆర్ ను నిలదీశారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పార్టీని కాపాడుకోవాలని హితవు పలికారు. జాగృతి మరింతగా ప్రజల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని కవిత హెచ్చరించారు.
కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడంపై..
మాజీ సీఎం కేసీఆర్ ను కసబ్ తో కాంగ్రెస్ నేతలు పోల్చడాన్ని కూడా కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి పక్ష నేతలను టెర్రరిస్టులతో పోల్చడమేంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది చాలా తప్పని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని నేతలు కూడా ప్రస్తుతం కేసీఆర్ ను అంటున్నారని విమర్శించారు. పార్టీలోని బబుల్ షూటర్ వల్లే బీఆర్ఎస్ కుంటు పడుతోందని పరోక్షంగా హరీశ్ ను ఉద్దేశించి చురకలు అంటించారు. మరోవైపు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా ప్రతిపక్షాలను తిడుతూ కాంగ్రెస్ నేతలు టైంపాస్ చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
‘ఆంధ్రా.. నీటిని దోచుకోవాలని చూస్తోంది’
తెలంగాణలోని నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్టెంపాడు, జూరాల, మక్తల్ ఇలా అనేక రిజర్వాయర్ లను పట్టించుకోకుండా పక్కన పడేసిందని చెప్పారు. ఆంధ్రాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. తెలంగాణ నీటిని దోచుకోవడానికే చూస్తుందని కవిత ఆరోపించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి చిత్తశుద్ది లేదని కవిత మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
Also Read: Suicide Case: title: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి బాత్రూమ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్!
ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై..
తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 4 నెలలు అవుతోందని కవిత అన్నారు. మండలి ఛైర్మన్ తన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని పేర్కొన్నారు. 4 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనే పర్యటనలు చేశానని.. చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని కవిత అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ నెల 5న కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం ఇస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చినట్లు కవిత చెప్పారు. మరోవైపు వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోటీ చేస్తుందని కవిత స్పష్టం చేశారు.

