PC Ghosh report: పీసీ ఘోష్ నివేదికను సవాలు చేస్తూ పిటిషన్‌పై విచారణ
అత్యవసర విచారణకు న్యాయస్థానం నో
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి నిరాకరణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్చ: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై (PC Ghosh report) ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు చుక్కెదురైంది. పిటిషన్‌పై అత్యవసర వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించేదు. మధ్యంతర ఉత్తర్వులు జారీ కూడా జారీ చేయలేమని స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ కొన్ని నెలలపాటు విచారణ జరిపి ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ జరిపిన ప్రభుత్వం, చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇందులో భాగంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ నివేదికను కొట్టి వేయాలంటూ పిటిషన్లలో పేర్కొన్నారు. అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటానికి నిరాకరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి ఒక రోజు ముందు మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అత్యవసర పిటిషన్‌గా పరిగణించి దీనిపై విచారణ జరపాలని కోరారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని, అసెంబ్లీలో తీర్మానం చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, ఈ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పాలని జీపీని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి (సెప్టెంబర్ 2) వాయిదా వేసింది.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికను కొట్టి వేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరపనుంది. కేసును సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై వాదనలు కొనసాగనున్నాయి.