Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ జనవరి రెండో వారానికి వాయిదా పడింది. అప్పటి వరకు ఇంతకు ముందు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు ఐఏఎస్ అధికారులు ఎస్.కే.జోషి, స్మితా సబర్వాల్ కు కాస్త ఊరట దక్కింది. లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కట్టిన ఏడాదికే కుంగిపోయిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ పీ.సీ.ఘోష్ నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసి దీనిపై విచారణ జరిపించింది. ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, నీటి పారుదల శాఖకు చెందిన పలువురు ఇంజనీర్లను ప్రశ్నించి వారి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది.
Also Read: Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ప్రమాణాలను పట్టించుకోక పోవటం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ
విచారణ పూర్తయిన తరువాత డిజైనింగ్ లోపాలు, నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోక పోవటం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయంటూ నివేదిక ఇచ్చింది. దీనికి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తోపాటు ప్రాజెక్టులో పని చేసిన పలువురు ఇంజనీర్లు బాధ్యులని పేర్కొంది. ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. కాగా, తమ నుంచి వివరణ తీసుకోకుండానే ఘోష్ కమిషన్ కాళేశ్వరం నివేదిక ఇచ్చిందంటూ కేసీఆర్, హరీష్ రావు, ఎస్.కే.జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను కొట్టి వేయాలని అభ్యర్థించారు.
హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదిక
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్ట వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మరోసారి కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ లతో కూడిన బెంచ్ కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్ పై సమాధానాలు ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో మూడు వారాల గడువును ఇచ్చింది. అప్పటివరకు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్ట వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది.
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరం కేసులో బిగ్ ట్విస్ట్.. ఇంజనీర్ల ఆస్తులు సీజ్ చేసిన అధికారులు
