Jubilee Hills By election: అక్టోబర్ లేదా నవంబర్ లో జూబ్లీహిల్స్ బైపోల్
బీఆర్ఎస్ తరహాలోనే రేవంత్ పాలన
బీసీల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు
బీఆర్ఎస్ కథ కంచికే.. ఫాంహౌస్ కే పరిమితం
టాయిలెట్స్ లేకపోవడంతోనే పిల్లల డ్రాపౌట్స్
అందుకే టాయిలెట్ క్లీనింగ్ మిషన్ల పంపిణీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అక్టోబర్ చివరి వారంలో కానీ, నవంబర్ మొదటి వారంలో కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By election) నిర్వహించే అవకాశముందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ తరహాలోనే రేవంత్ పాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు. అందుకే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సమాధానం చెప్పిన తర్వాతే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అడుగుపెట్టాలన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలని, ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ ఓట్లు అడగాలన్నారు. బీసీల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదని విమర్శలు చేశారు. వీధి లైట్లు కూడా వెలిగించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజల బతుకులు మారలేదని పేర్కొన్నారు. కలుషిత మంచినీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం పోయిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ కథ కంచికేనని, ఫాంహౌస్‌కే పరిమితమని ఎద్దేవాచేశారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చడానికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.
Read Also- Nandamuri Balakrishna: నాకు ఈ లెక్కలన్నీ గుర్తుండవ్.. అవన్నీ అభిమానులే గుర్తు పెట్టుకుంటారు
ఇదిలావుంచితే, రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడంతోనే పిల్లల డ్రాపౌట్స్ జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాల్లో శనివారం ఆయన టాయిలెట్స్ క్లీనింగ్ మిషన్స్‌ను పంపిణీ చేశారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నా.. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ క్లీనింగ్ మిషన్స్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. కాగా రాణిగుంజ్ లోని ఆద్య మెమోరియల్, కలాసిగుడ, పార్క్ లేన, నల్లగుట్టలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆర్పీ రోడ్డులో ఉన్న ఆర్య సమాజ్ స్కూల్లో ఈ మిషన్లను అందిచినట్లు తెలిపారు. నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్కూల్ బిల్డింగ్స్ శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని పున:నిర్మించాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ముఖ్యంగా టాయిలెట్స్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాలన్నారు.
Read Also- Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై అధికారుల ఫోకస్.. ఆ రెండు జిల్లాల్లో…
ఇదిలా ఉండగా గతేడాది.. ప్రధాని మోదీ ప్రారంభించిన సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. కాగా ఈ మార్గంలో ప్రధాన స్టేషన్లు అయిన సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల స్టేషన్లలో హాల్టింగ్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే చొరవతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి ఈ రెండు స్టేషన్లలో హాల్టింగ్ ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తెలంగాణలో రైల్వే మౌలిక వసతులకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కిషన్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ధన్యవాదాలు తెలిపారు.