Jogipet CI: జోగిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) అనీల్ కుమార్ తన కార్యాలయంలో పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అది అనుకోకుండా పేలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం సీఐ కార్యాలయంలో చోటు చేసుకుంది. సీఐ తన కుర్చీలో కూర్చుని పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లి గోడకు తగలడంతో గోడ పగిలింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన హెడ్ కానిస్టేబుల్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.
ఆ సమయంలో సీఐ చింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతున్నారని, అనుకోకుండా పిస్టల్ ట్రిగ్గర్‌పై చెయ్యి పడటంతో అది పేలిందని భావిస్తున్నారు. ఈ ఘటనతో కార్యాలయంలో ఉన్న వట్‌పల్లి ఎస్ఐ, ఆందోల్ మాజీ కౌన్సిలర్ హరికృష్ణ, ఆత్మ డైరెక్టర్ రొయ్యల శ్రీనివాస్ సహా అక్కడున్నవారంతా బయటకు పరుగులు తీశారు. పక్క స్టేషన్ బయట ఉన్న జోగిపేట ఎస్ఐ పాండు కూడా శబ్దం విని సీఐ కార్యాలయం వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు.