Janwada Land Scam: సత్యం కంప్యూటర్ స్కామ్ లో భాగమైన జన్వాడ భూముల వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి ఈడీ స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యహారంలో ఈడీకి కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో రూ.5000 కోట్ల విలువైన 97 ఎకరాల భూముల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.
2014 నుంచి ఈడీ విచారణ..
హైదరాబాద్ శివార్లలోని జన్వాడ భూముల కుంభకోణానికి సంబంధించి 2014లోనే ఈడీ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్స్‌తో కొనసాగుతూనే ఉంది. కేసులోని ఏ 153 శతభిష కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న తన స్టేట్మెంట్‌ను సాక్షిగా రికార్డ్ చేయాలంటూ ఏ 12 అభినవ్ అల్లడి ఈ మధ్యే ఈడీ కోర్టులో పిటిషన్ వేశారు. ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఇవ్వండి అంటూ శతభిష కంపెనీ పేరుతో ఆయన ముందుకు రావడం ఇటీవల సంచలనం రేపింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టి ఈడీ స్పెషల్ కోర్టు.. జన్వాడ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 213 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది.
జన్వాడ భూముల వివాదం?
2009కి ముందు 252 కంపెనీలను సృష్టించిన సత్యం రామలింగరాజు బినామీల మాటున హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల భూములను వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జన్వాడలోని సర్వే నెంబర్ 311/1 లో 3.10 ఎకరాలు (ఖాతా నెం. 60699), 306 నుంచి 316 వరకు ఉండే సర్వే నెంబర్స్‌లోని భూములను సత్యం కంప్యూటర్స్ మోసాలతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ భూములు మొదట మదన్ గోపాల్, శ్యామ్‌లాల్ (1954-1990 పహాణీల ప్రకారం) పేర్లపై ఉండేవి. తర్వాత రికార్డులు మార్చారు. రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి, రాజకీయ నాయకుల సహకారంతో ఏ 153 శతభిష కంపెనీని ఫ్రాడ్‌గా ఎంటర్ చేశారు. ఈ సర్వే నెంబర్లలోని మొత్తం 90 ఎకరాల విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. అభినవ్ పిటిషన్, ఈడీ కోర్టు విచారణ నేపథ్యంలో ఈ తీగ లాగి మిగిలిన వందల ఎకరాల డొంకంతా కదులిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Gaddelu Controversy: తెలంగాణలో గద్దెల దుమారం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్.. అసలేంటీ లొల్లి!
గతంలో ఏం జరిగిందంటే?
2009కి ముందు వేలాది ఉద్యోగులతో తిరుగులేని ఐటీ శక్తిగా సత్యం కంప్యూటర్స్ ఎదిగింది. అమెరికాలో కూడా లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. అయితే షేర్స్ ధరను పెంచేసి తప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్‌తో భారీ స్కాంకు సత్యం రాజు తెరతీశారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన అభియోగాలపై 2009లో కేసు కూడా నమోదైంది. సుదీర్ఘ విచారణల తర్వాత 2015లో సీబీఐ కోర్టు సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ (ప్రస్తుతం మాజీ) రామ లింగరాజుతో పాటు 9 మందికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధించింది. అయితే మనీ లాండరింగ్‌కు సంబంధించి ఆ సమయంలో ఎవరూ అంతగా ఫోకస్ చేయలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల బినామీల పేరుతో కొన్న భూముల లావాదేవీలు ఏవీ బయటకు రాలేదు. అయితే తాము సాక్షిగా మారతామని ప్రస్తుతం ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటం ఆసక్తి రేపుతోంది.

