Bandi Sanjay: మంచు పర్వతాలలో, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) దేశానికి చేస్తున్న సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 3,488 కిలోమీటర్ల పొడవైన భారత్-చైనా సరిహద్దు రక్షణలో ఐటీబీపీ సిబ్బంది సేవలు అమోఘమని ఆయన అభివర్ణించారు. ఐటీబీపీ 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ 15వ ఐటీబీపీ బెటాలియన్ కేంద్రంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం ఐటీబీపీ అమరవీరుల స్మారక స్థలికి వెళ్లిన కేంద్ర మంత్రి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఘన నివాళులర్పించారు. అనంతరం రిమోట్ ద్వారా నూతనంగా నిర్మించిన ఐటీబీపీ భవనాలను, బ్యారక్‌లను ప్రారంభించారు.
Also Read: Bandi Sanjay: మావోయిస్టులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?
ఐటీబీపీ కీలక పాత్ర
భారత్-చైనా సరిహద్దు భద్రతతో పాటు, దేశ అంతర్గత భద్రతలో, ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లను ఎదుర్కోవడంలో, జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఐటీబీపీ కీలక పాత్ర పోషించి, వీరోచిత ధైర్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణ కోసం సహాయ చర్యలు అందిస్తూ ఐటీబీపీ సిబ్బంది ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ‘సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్’ కింద స్థానిక ప్రజలకు స్వయం ఉపాధి శిక్షణనివ్వడం భేష్ అని అభినందించారు. పర్వతారోహణసహా అడ్వెంచర్ స్పోర్ట్స్‌లోనూ ఐటీబీపీ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోందని చెప్పారు.
14 మంది మహిళా పర్వతారోహకులు
ఐటీబీపీ తొలిసారిగా నిర్వహించిన ‘ఆల్ ఉమెన్ మౌంటెనిరింగ్ ఎక్స్‌పెడిషన్-2025 (మౌంట్ నున్)’లో 14 మంది మహిళా పర్వతారోహకులు 7,135 మీటర్ల ఎత్తైన మౌంట్ నున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి దేశానికి గౌరవం తీసుకువచ్చారని కొనియాడారు. ‘జర్సార్ ప్రాజెక్ట్’ కింద భూఉష్ణ శక్తి, సౌర శక్తి, పవన శక్తి వినియోగం ద్వారా హిమవీరులకు స్పేస్ హీటింగ్, వేడి నీటి సదుపాయాలు కల్పించబడుతున్నాయని తెలిపారు. ఐటీబీపీ దళంలోని వివిధ విభాగాలకు సంబంధించి ఈ ఏడాది 253 భవనాలు, 9 ఏఎస్ఐ మెస్‌లు, 4 జవాన్ బ్యారక్‌లను నిర్మించి, ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఐటీబీపీ డీజీ ప్రవీణ్ కుమార్ తోపాటు పలువురు ఐజీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: Bandi Sanjay: యువత రాజకీయాల్లోకి రావాలి… కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు

