Inter Caste Marriages: రాష్ట్రంలో కుల వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక విభేదాలను తొలగించడమే లక్ష్యంగా కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మార్పునకు ఆర్థిక భరోసా.. కులాంతర వివాహాలు సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే కీలక సాధనమని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’ కేవలం సంక్షేమ పథకంగా కాకుండా, సామాజిక సంస్కరణ ఉద్యమంగా అమలు చేస్తోంది. కులాంతర వివాహాల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో నల్లగొండ, వరంగల్ అర్బన్, మంచిర్యాల, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉన్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రత్యేక నివేదిక వెల్లడించింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 994 కులాంతర వివాహ జంటలను గుర్తించి, వారందరికీ ప్రభుత్వం తరపున ఒక్కో జంటకు రూ. 2.50 లక్షల చొప్పున ఆర్థిక భరోసా కల్పించారు. ఇందులో భాగంగా పెద్దపల్లిలో 114 జంటలకు రూ. 2.85 కోట్లు, నల్లగొండలో 111 జంటలకు రూ. 2.77 కోట్లు, వరంగల్‌లో 111 జంటలకు రూ. 2.77 కోట్లు, మంచిర్యాలలో 85 జంటలకు రూ. 1.85 కోట్లు, నిజామాబాద్‌లో 67 జంటలకు రూ. 1.67 కోట్లు పంపిణీ చేశారు.
మరింత పెంపు
మొత్తం 33 జిల్లాలకు గాను రూ. 26.80 కోట్లు విడుదల చేయగా, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది నిధుల పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. కొన్ని జిల్లాల్లో నిధుల వినియోగం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం, అవగాహన లోపం, దరఖాస్తుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ఇక అవగాహన లోపం, దరఖాస్తుల కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలోనే హై లెవల్ మీటింగ్ లు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
Also Read: International Zoo Project: ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో జూ పార్క్ ఏర్పాటు.. ఈ నెల చివరణ..!
సామాజిక మార్పుకు ఆర్థిక భరోసా
గత పాలనల్లో నిధుల విడుదలలో జాప్యం, లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం చోటుచేసుకున్నప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలపరిమితిలో నిధుల విడుదల, పారదర్శక అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా స్థాయిలో అవగాహన కల్పిస్తూ కులాంతర వివాహాలపై ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు. రాబోయే కాలంలో కులాంతర వివాహాల పథకాన్ని మరింత విస్తృతం చేయడం, నిధుల పెంపు, ప్రక్రియ సరళీకరణ, యువతలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అధికారులు వివరించారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో సామాజిక న్యాయమే ప్రభుత్వ పాలనకు మూల స్తంభం అన్నారు. ‘కుల వివక్ష పేరుతో యువత జీవితాలు ఆగిపోవద్దు. రాజ్యాంగ విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చు. గతంలో కులాంతర వివాహాల ప్రోత్సాహం కాగితాలకే పరిమితమైంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. కుల వివక్షను తొలగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సామాజిక సంకల్పంతో ముందుకెళ్తోంది’ అని లక్ష్మణ్ తెలిపారు.
Also Read: International Zoo Project: ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో జూ పార్క్ ఏర్పాటు.. ఈ నెల చివరణ..!

