RMP Medical: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్ఎంపీ క్లినిక్‌లలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యుడి ప్రిస్కిప్షన్ (చీటీ) లేకుండానే యథేచ్ఛగా ఔషధాలను విక్రయిస్తున్నారు. వైద్యుడి దగ్గరకు వెళ్తే ఫీజులు అధికమవుతాయనే ఉద్దేశంతో పేదలు నేరుగా ఆర్ఎంపీల వద్దకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా రోగమొస్తే మొదటగా గుర్తొచ్చేది ఆర్‌ఎంపీలే. ఇలా రోగులు వస్తుండడంతో క్లినిక్‌లు గల్లీకొకటి చొప్పున పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక గదులను అద్దెకు తీసుకుని, మంచి ఫర్నిచర్ పెట్టి మెరుగైన వైద్యం అందిస్తామనే స్థాయిలో ఆకర్షిస్తున్నారు. ఆర్‌ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలి. తీవ్రతను బట్టి పీహెచ్‌సీ, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. కానీ, ప్రిస్కిప్షన్ పెట్టుకుని ల్యాబ్ టెస్టులు, మందులు, స్కానింగ్‌లు చేస్తున్నారు. ఫ్లూయిడ్స్ అమర్చి పరిమితికి మించి యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు
జిల్లాలోని ఆర్ఎంపీ క్లినిక్‌లలో కేవలం ప్రథమ చికిత్స అందించాలి. కానీ, ఆర్ఎంపీలు మందుల విక్రయాలు కూడా చేస్తున్నారు. జిల్లాలో ఆర్ఎంపీ క్లినిక్‌లు, మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది. గుర్తింపు పొందిన వైద్యుడు సూచించిన (ప్రిస్కిప్షన్)వి మాత్రమే విక్రయించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. నిబంధన పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఆర్ఎంపీ క్లినిక్‌లలో ఔషధ దుకాణాలను ఏర్పాటు చేసుకొని తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ధరూర్, కేటిదొడ్డి, మల్దకల్, గట్టు, తదితర మండలాల్లో ఆర్ఎంపీలు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించినప్పుడు తప్పనిసరిగా రసీదు ఇవ్వాల్సి ఉండగా నిర్వాహకులు ఇవేమీ పాటించడం లేదు. అదేవిధంగా జ్వరం, జలుబు, తలనొప్పి, చిన్నపిల్లలకు సంబంధించిన సిరప్స్, యాంటీ బయోటిక్స్ వంటివి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ఏదైనా సమస్య చెబితే వాటికి అనుసంధానంగా ఒకే తరహా మందులను అంటగడుతూ మెడికల్ మాఫియాకు తెరలేపుతున్నారు. ఆర్ఎంపీ క్లినిక్‌లపై ఔషద నియంత్రణ అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also- BRS Politics: అన్న కార్యక్రమం కళకళ… చెల్లి కార్యక్రమం వెలవెల..
ప్రజాప్రతినిధుల ఒత్తిడి
ఆర్ఎంపీలపై చర్యలు చేపట్టేందుకు ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తున్నది. అడపా దడపా తనిఖీలు చేపడుతూ కేసులు సైతం నమోదు చేస్తున్నది. కానీ, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వెనుకంజ వేయాల్సి వస్తున్నదని అధికారులు అంటున్నారు. పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నామనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నిద్రపోతున్న ఔషధ నియంత్రణ శాఖ
అయితే, జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ నిద్రమత్తులో తూలుతోంది. శాంపిల్ దందాలు, ఆర్‌ఎంపీల మందుల విక్రయాలపై ఫిర్యాదులు చేస్తే తప్ప తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో వారు ఆడిందే ఆటగా దందా సాగుతున్నది. ఈ విషయంపై జిల్లా ఔషధ నియంత్రణ అధికారిని వివరణ కోరేందుకు ‘స్వేచ్ఛ’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
Read Also- Aaraa Mastan: గుంటూరు మస్తాన్ హైదరాబాద్‌లో కబ్జా! అన్ని పార్టీల అండదండలు