Illegal Liquor Sales: ఇరు నియోజక వర్గాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా విస్తరిస్తున్నాయన్న ఆరోపణలు రోజురోజుకు బలపడుతున్నాయి. ప్రధాన రహదారులతో పాటు సందులు, గల్లీలు, జనావాసాల మధ్య కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీధి ప్రారంభం నుంచి వీధి చివరి వరకు మందు దుకాణాలే కనిపిస్తున్నాయన్న స్థాయికి పరిస్థితి దిగజారింది. దీని ప్రభావంతో సామాన్యుల జేబుల్లో పైసలు నిలవడం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మద్యం విక్రయ కేంద్రాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా అమ్మకాలు కొనసాగుతుండటంతో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత మద్యానికి ఎక్కువగా బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
మహిళలు ఆవేదన..
ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం మద్యానికి బానిసలవుతున్న వారిలో అధిక శాతం యువకులేనని తేలింది. ఉదయం 11 గంటల నుంచే అమ్మకాలు ఊపందుకోవడంతో మద్యం సేవించడం సాధారణ అలవాటుగా మారింది. బడికి పిల్లాడు వెళ్లకపోతే ఎలా అనిపిస్తుందో, మద్యం దుకాణానికి వెళ్లకపోతే అలా అనిపించే స్థితికి పరిస్థితులు మారిపోయాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. దీని ప్రభావంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. రోజువారీ ఆదాయం మద్యం ఖర్చులకే వెచ్చిపోవడంతో గృహ అవసరాలు నెరవేర్చడం కష్టమవుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలకే కాకుండా, లైసెన్సులు లేకపోయినా కిరాణా షాపుల్లో కైని, గుట్కా, సిగరెట్లు బహిరంగంగా అమ్ముడవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్న లైసెన్సులకు రెన్యువల్స్ లేకపోయినా విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారుల పక్కన, పార్కింగ్ సదుపాయాలు లేని చోట్ల కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి నెలకొంది.
Also Read: Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
విచ్చలవిడిగా ఉన్న దుకాణాలు
గ్రామాలు, పట్టణాల్లో మద్యం దుకాణాల సమీపంలో గొడవలు, అసాంఘిక ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. పాఠశాలలు, ఆలయాలు, నివాస ప్రాంతాల సమీపంలోనూ మద్యం అమ్మకాలు జరగడం ప్రజల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తోంది. విచ్చలవిడిగా ఉన్న ఈ దుకాణాల కారణంగా యువత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, గుండెజబ్బులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో కొందరు అకాల మరణాలకు గురవుతున్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వ్యాపారాలకు రక్షణగా కొందరు ప్రెస్ ఐడీ కార్డులను అడ్డుపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. జర్నలిజం గుర్తింపును దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
న్యూ ఇయర్ వేడుకలు
ఇదిలా ఉండగా, డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమీపించడంతో అశ్వారావుపేట నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త సంవత్సరం వేడుకల పేరిట రెండు రోజుల పాటు విక్రయాలు అధికంగా జరిగే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విపరీతంగా ఉన్న అమ్మకాలకు న్యూ ఇయర్ వేడుకలు తోడైతే శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అశ్వారావుపేట నియోజకవర్గంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనధికార మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మద్యం, మత్తు పదార్థాల విక్రయాలపై కట్టుదిట్ట నియంత్రణలు అమలు చేయాలని కోరుతున్నారు. లేదంటే సామాజిక, ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Kasam Venkateshwarlu: ఆ అర్బన్ నక్సలైట్‌ను బొక్కలో వేస్తాం.. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి..?

