తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Notices to Smita Sabharwal: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ అయిన ఫేక్ పోస్టుల విషయంలో దర్యాప్తును ముమ్మరం చేసిన గచ్చిబౌలి పోలీసులు ఐఏఎస్ అధికారి స్మతి సబర్వాల్ కు నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ 179 సెక్షన్ ప్రకారం జారీ చేసిన ఈ నోటీసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరపటానికి శ్రీకారం చుట్టింది. అయితే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అభివృద్ధి పేర చెట్లను నరికి వేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
ఈ భూముల్లో నెమళ్లు, జింకలు ఉన్నాయని, చెట్లను నరకటం వల్ల అవి జనావాసాల్లోకి వెళుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలి భూముల్లో నెమళ్లు, జింకలు ఉన్నట్టుగా, చెట్లను నరకటం వల్ల వాటి ఉనికి ప్రమాదం ఏర్పడినట్టుగా పెద్ద సంఖ్యలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ అయ్యాయి. ఇలా పోస్టులు పెట్టిన వారిలో బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్, కొణతం దిలీప్ తోపాటు 25మంది సెలబ్రెటీలు, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read: MP Kishan Reddy: కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీలో దుమారం.. ఇన్‌చార్జ్ ఎవరు? బీజేపీలో తర్జన భర్జన!
ఇక, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించినవని తేలింది. ఈ మేరకు ఫిర్యాదులు అందటంతో గచ్చిబౌలి పోలీసులు బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్, దిలీప్ లతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. ఇద్దరికీ నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ జరిపారు.
రీ పోస్ట్…
గత నెల 31న హాయ్ హైదరాబాద్ అన్న హ్యాండిల్ నుంచి ఎక్స్ లో కంచ గచ్చిబౌలిలో ఉన్న మష్రూమ్ రాక్ ముందు పెద్ద సంఖ్యలో బుల్ డోజర్లు, వాటి ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్టుగా గిబ్లీ ఇమేజ్ అప్ లోడ్ అయ్యింది. దీనిని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రీ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఇమేజ్ పై పోలీసులు జరిపిన విచారణలో అది ఫేక్ ఫోటో అని తేలింది. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసినట్టుగా సీఐ మహ్మద్ హబీబుల్లా ఖాన్ తెలిపారు.
బీఎన్ఎస్ 179 సెక్షన్ ప్రకారం నోటీసు జారీ చేసి కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి వాంగ్మూలాలను నమోదు చేయవచ్చన్నారు. కాగా, ఈ నోటీసుపై స్మితా సబర్వాల్ ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయంగా మారింది.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/