Hydra on Alwal: అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట చెరువుకు చేరువుగా ఉన్న హిందూ స్మశానవాటిక కబ్జాకు గురవుతుందంటూ ఇటీవలే హైడ్రాకు మచ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఫిర్యాదు అందటంతో వాస్తవాలను తెల్సుకునేందుకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఆ ప్రాంతంలో క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు. హిందూ స్మశానవాటికను రామ్‌కీ సంస్థ కబ్జాచేసి, అందులో అక్రమంగా చెత్తను డంప్ చేస్తున్నట్లు, దీంతో పరిసరాలన్నీ ధుర్గంధభరితగా మారినట్లు హైడ్రా కమిషనర్ గుర్తించారు.
సర్వే నంబరు 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలాన్ని హిందూ స్మశానవాటికకు కేటాయించగా, ఆ స్థలంలో రామ్‌కీ సంస్థ చెత్త డంపింగ్ చేయడాన్ని, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కమిషనర్ గుర్తించారు. మండుటెండలో పెద్ద ఎత్తున స్థానికులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి, అక్రమ చెత్త డంపింగ్, అక్రమ నిర్మాణాలతో స్మశాన కబ్జాపై కమిషనర్ కు వివరించారు.
ఇదే విషయంపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి కూడా ఫిర్యాదులు అందటంతో సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చే దిశగా హైడ్రా కమిషనర్ ఈ పర్యటన నిర్వహించినట్లు సమాచారం. ఈ సమస్యను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మంత్రి శ్రీధర్ బాబు కూడా తమకు సూచించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు తెలిపారు.
రామ్‌కీ సంస్థకు రెండు ఎకరాల స్థలం కేటాయించినట్టు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఇక్కడున్న ప్రభుత్వ భూమి మూడు నాలుగు ఎకరాల వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామని ఆయన వివరించారు. తక్షణమే నిర్మాణాలను ఆపేయాలని రామ్‌కీ సంస్థను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూస్తామని, అలాగే జనావాసాల మధ్య చెత్త డంపింగ్ యార్డును నిర్వహిస్తుండడంతో ఇబ్బందికర పరిస్ఙితులను గమనించామని, దానికి కూడా బ్రేక్ వేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: స్లాట్ బుకింగ్ ఇక సులువు..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చెత్త డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ చెప్పడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాంకీ సంస్థ అక్రమంగా డంప్ చేస్తున్న కారణంగా తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని, తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి, చెత్త డంపింగ్ యార్డును కమిషనర్ పరిశీలించటం పట్ల స్థానికులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
యువతిని కాపాడిన హైడ్రా
కుటుంబ కలాహాలతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, సమాచారం తెల్సుకుని అపమత్తమైన హైడ్రా ఆ యువతిని కాపాడింది. బాలానగర్ సమీపంలోని రాజీవ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ భార్య మెర్రీ(36)కుటుంబ కలహాలతో మంగళవారం హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన పలువురు స్థానికులు ఈ సమాచారాన్ని ఫోన్ చసి హైడ్రాకు చెప్పారు.
దీంతో హుటహుటీన అక్కడకు చేరుకున్న హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్ తాడు సాయంతో ఆమెను సాగర్ లో నుంచి సురక్షితంగా బయటకు తీసి, కాపాడారు. ఆ తర్వాత ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ట్యాంక్ బండ్ పై ఏం జరుగుతుందన్న విషయాన్ని చూసేందుకు వందలాది మంది వాహానదారులు గుమిగూడారు. విషయం తెల్సుకున్న వాహనదారులు సమయస్పూర్తితో స్పందించిన హైడ్రా ఆ యువతిని కాపాడటం పట్ల డీఆర్ఎఫ్ టీమ్ ను అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు