Mobile Blast News: హైదరాబాద్‌లోని (Hyderabad News) జగద్గిరిగుట్ట ప్రాంతంలో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ పేలిన ఘటనలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనమయ్యాడు. ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. సాయి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంటల ధాటికి అతడి శరీరం కాలిపోయింది. సాయి మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చేతికి అందిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సెల్‌ఫోన్ పేలుడు, షార్ట్‌సర్క్యూట్‌కు కూడా దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. సాయి వయసు 27 సంవత్సరాలు అని, జగద్గిరిగుట్ట రింగుబస్తీలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు శనివారం ఉదయం గుడికి వెళ్లగా, సాయి ఇంటి వద్దే ఉన్నాడు. ఆ సమయంలో ఈ పేలుడు జరిగింది. ఇంటి నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు అతడి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. సాయి తల్లిదండ్రులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఇల్లు మొత్తం పొగలు వ్యాపించాయి. సాయి మంటల్లో కాలిపోయి మృతి చెందినట్టు గుర్తించారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతుండగా పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం మృతదేహాన్ని గాంధీకి హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు.
Read this- Helicopter on Road: నడిరోడ్డుపై హెలికాప్టర్ ల్యాండింగ్.. నుజ్జునుజ్జైన కారు
అప్రమత్తతలేని యువత
తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా యువత అప్రమత్తంగా ఉండకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ తరహా ప్రమాదాలు ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చోటుచేసుకుంటున్నా కనువిప్పు కలగకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ మధ్యే కామారెడ్డి జిల్లాలో సాయిలు అనే యువకుడు, అన్నమయ్య జిల్లాలో ప్యాంట్ జేబులో మొబైల్ పేలి మరో యువకుడు చనిపోయారు. ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడడం చాలా ప్రమాదకరమని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా యువత పెడచెవిన పెడుతున్నారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉన్నప్పుడే ఫోన్లు వాడడం, మాట్లాడుతుండడం చేస్తున్నారు. ఇక, నాసిరకమైన బ్యాటరీలు, పాత బ్యాటరీలు పేలిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు ఎంతో మేలు
ఛార్జింగ్ పెట్టి ఉన్నప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడకూడదు. ఫోన్ వేడిగా అనిపించినప్పుడు కూడా వాడకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ వాడితే మరింత వేడెక్కి పేలుడికి దారితీస్తుంది. సరైన డైరెక్షన్‌లో పట్టుకొని మాత్రమే మొబైల్ వినియోగించాలి. లేదంటే, మెడ, వెన్నునొప్పి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫోన్ వినియోగ సమయాన్ని కూడా పరిమితం చేసుకుంటే ఆరోగ్యానికి మంచింది. కంటిపై ఒత్తిడి పడకుండా, నిద్రలేమి సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇయర్‌ఫోన్లు ఉపయోగించడం కూడా అంత మంచిది కాదు. ఇయర్‌ఫోన్లు వాడితే రేడియేషన్ నేరుగా తలను తాకే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక, నిద్రపోతున్న సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఫోన్‌ను దిండు కింద ఉంచి నిద్రపోకూడదని, కనీసం కొన్ని అడుగుల దూరంలోనైనా ఫోన్‌ను ఉంచాలని సూచిస్తున్నారు.
Read this- Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు