Hyderabad Floods: గ్రేటర్ హైదరాబాద్ లో సోమవారం రెండు గంటల పాటు కురిసిన వర్షానికి దేవర కొండ బస్తీలోని ఇండ్లలోకి నీరు వచ్చిన విషయాన్ని తెల్సుకున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. నాలా పొంగి ప్రవహించటం వల్లే వేంకటేశ్వర కాలనీ డివిజన్ లోని దేవరకొండ బస్తీ నీటి మునిగి, బస్తీ వాసుల ఇండ్లలోకి నీళ్లు వచ్చినట్లు గుర్తించారు. బాధితులను నేరుగా కలిసి మేయర్ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాలా పూడికతీత పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ, హైడ్రాధికారులను మేయర్ ఆదేశించారు. ఆ తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ తో కేబీఆర్ పార్క్ వద్ద గల మేజర్ లాగింగ్ పాయింట్ లను పరిశీలించారు.
Also Read: Shreyas Iyer: అయ్యర్‌కు ఏమైంది?.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ టీమ్ నుంచి వైదొలగిన వైనం
శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఎన్‌టీఆర్ ట్రస్టుభవన్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మధ్యన జూబ్లీహిల్స్ వైపు వెళ్లే మార్గంలో వరద నీరు నిలిచిపోవడాన్ని గమనించారు. కేబీఆర్ పార్కులో ఉన్న కుంటలు నిండిపోయి నీరంతా రోడ్డుమీదకు రావడంతో ఈ సమస్య తలెత్తుతోందని అధికారులు తెలిపారు. ఆ వరదను రోడ్డు దాటించేందుకు చర్యలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పైపు లైను నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ సూచించారు.
నగర శివారులోని పెద్దంబర్‌పేట లోని ఔటర్ కూడలి పక్కన ఉన్న కత్వా జలాశయంలో ఆదివారం గల్లంతైన సాయితేజ(17) కోసం గాలింపు చర్యలు సోమవారం కూడా హైడ్రా కొనసాగించినట్లు కమిషనర్ రంగనాధ్ వివరించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ చెరువునీరు పోటెత్తడంతో బంజారా కాలనీ నీట మునిగిన విషయాన్ని అధికారులు మేయర్ కు వివరించగా, ఈ కాలనీలో చిక్కుకున్న వృద్ధులను, గర్భిణీ స్త్రీలను బోటు సాయంతో డీఆర్ ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు కమిషనర్ వెల్లడించారు. ఆ దగ్గర లోని కమ్యూనిటీ హాల్‌లో ఆశ్రయం కల్పించిన నట్లు హైడ్రా కమిషనర్ మేయర్ కు వివరించారు.