Hyderabad Library: హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో వివిధ విభాగాల్లో అన్ని రకాల విలువైన పుస్తకాలు, దినపత్రికలు రీడర్లకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించారు. లైబ్రరీలోని అన్ని విభాగాలను పరిశీలించిన కలెక్టర్, అక్కడికి వచ్చిన రీడర్లతో గ్రంథాలయంలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే రీడర్స్ సంఖ్య ఎక్కువగా ఉన్నందున లైబ్రరీ వలంటీర్లను ఏర్పాటు చేసుకుని, పలు విభాగాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. నియమించిన వారందరికీ ఐడీ కార్డులు కూడా అందజేయాలని సూచించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యతోపాటు వ్యక్తిగత వృద్ధి, అలాగే సమాజాభివృద్ధికి ముఖ్యమైనవని కలెక్టర్ వివరించారు. లైబ్రరీలోని చిల్డ్రన్స్ విభాగం, మహిళా విభాగం, జ్ఞాన జ్యోతి రీడింగ్ హాల్ (అంధులు), పాఠ్యపుస్తకాల విభాగం, పాత దినపత్రికల విభాగం, సమావేశపు హాళ్లను ఆమె పరిశీలించారు. లైబ్రరీలో నిరంతరం విద్యుత్, తాగునీరు, సరైన వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ గ్రంథాలయానికి వచ్చే రీడర్ల కోసం ఉన్నత విద్య, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ బుక్స్, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఈసెట్, నీట్ తదితర కోర్సులకు సంబంధించి విలువైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా సంసిద్ధులై ఉండాలని కలెక్టర్ సూచించారు.
Also Read: GHMC 1st Position: కుక్కల విషయంలో హైదరాబాద్ సంచలన రికార్డ్.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
