DCP Aravindh Babu: విదేశాల నుంచి మోసాలకు పాల్పడుతూ ఏటా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్(Cyber Criminals)కు చెక్ పెట్టేందుకు సైబర్ క్రైం పోలీసులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తుండటం ద్వారా ఈ దిశలో ఇప్పటికే సత్ఫలితాలు సాధించారు కూడా. తాజాగా, కమీషన్ల కోసం కక్కుర్తి పడి సైబర్ కేటుగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూరుస్తున్న వారిపై దృష్టి సారించారు. ఇలా సైబర్ క్రిమినల్స్ కు సహకరిస్తే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తామని హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు(DCP Aravindh Babu) హెచ్చరించారు. సమయంలో బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేస్తామని చెప్పారు.
Also Read: Sikkim Sundari: అంతుచిక్కని రహస్యం.. రాతి నుంచి పుట్టుకొచ్చే.. అరుదైన హిమాలయ పువ్వు!
ప్రతీ నెలా కమీషన్ల రూపం
సైబర్ నేరాల్లో అరెస్టులు అవుతున్నా వారిలో ఎనభైశాతం మందికి పైగా క్రిమినల్స్ కు బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన వారే ఉంటున్నారు. చిరు వ్యాపారులు, యువకులు, డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులను ప్రతీ నెలా కమీషన్ల రూపంలో డబ్బు ఇస్తామని ఆశ పెడుతున్న సైబర్ క్రిమినల్స్ తాము చేస్తున్న మోసాల ద్వారా కొల్లగొడుతున్న డబ్బును ఆయా అకౌంట్లలో జమ చేయిస్తున్నారు. ఆ తరువాత క్రిప్టో కరెన్సీ(Cryptocurrency)గా మార్చి తమ ఖాతాల్లోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ కేటుగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చవద్దని డీసీపీ అరవింద్ బాబు హెచ్చరించారు. నేరుగా నేరానికి పాల్పడక పోయినా బ్యాంక్ ఖాతా నుంచి జరిగే ప్రతీ లావాదేవీకి ఖాతాదారు బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అకౌంట్ దుర్వినియోగం అయితున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also Read: New Year 2026: ప్రపంచవ్యాప్తంగా 2026 కొత్త సంవత్సరం వేడుకలు ఎలా జరుపుకుంటారంటే?

