Corruption Case: హైదరాబాద్‌లోని కుల్సుంపురా సీఐ సునీల్ విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై హైదరాబాద్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ (VC Sajjanar) సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణపై స్టేషన్‌కు ఫిర్యాదు కూడా అందింది. అయితే, కేసు నమోదు చేసే క్రమంలో సీఐ సునీల్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
ఫిర్యాదులో ఉన్న నిందితులలో ఒక పక్షం వారి నుంచి సునీల్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేటప్పుడు అతను నిందితుల పేర్లను మార్చి నమోదు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం కమిషనర్ దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే ఈ సంఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో, సీఐ సునీల్ నిందితుల పేర్లను మార్చిన మాట నిజమేనని నిర్ధారణ అయింది. దీంతో, సజ్జనార్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

