CM Revanth Reddy: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గోట్ ఇండియా- 2025 టూర్ దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది. మెస్సీ పర్యటించనున్న కోల్‌కత్తా, ముంబై, ఢిల్లీలో కంటే కూడా హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే, హైదరాబాద్‌లో ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగేది కేవలం మెస్సీ మ్యాచ్ కాదు. అది మెస్సీతో తలపడనున్న సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ అనే స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. హైదరాబాద్‌లో మెస్సీ ఆడే మ్యాచ్‌లో రేవంత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఒక రాజకీయ నేత, దిగ్గజ క్రీడాకారుడి మధ్య జరగనున్న ఈ పోరు ప్లేయర్ వర్సెస్ పొలిటీషియన్ మ్యాచ్‌గా యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది. ఫుట్‌బాల్ ఆటను అమితంగా ఇష్టపడే రేవంత్ రెడ్డి, మెస్సీ టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా, దిగ్గజ ఆటగాడితో తలపడేందుకు ఆయన తన ఆటతీరుకు పదనుపెడుతున్నారు. హైదరాబాద్ ఎంహెచ్ఆర్డీలో రోజూ కొంత సమయాన్ని ప్రాక్టీస్ కోసం కేటాయించడం గమనార్హం.
క్రీడాకారులకు స్వర్ణయుగం
సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి క్రీడల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించాలన్న తపన రేవంత్ రెడ్డి ప్రయత్నాల్లో కనిపిస్తున్నది. దేశంలోనే మొట్టమొదటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో నెలకొల్పాలనే ఆలోచన మొదలుకొని, పతకాలు గెలిచిన క్రీడాకారులకు ఆర్థిక సాయం, ఉద్యోగాలు కల్పించడం క్రీడలపై ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి బాక్సర్ నికత్ జరీన్, క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, గొంగడి త్రిష వంటి అనేక మంది క్రీడాకారులకు ఆర్థిక నజరానాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ మ్యాచ్ వలన హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Singareni News: అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ విజన్ డాక్యుమెంట్ విడుదల
భవిష్యత్తు ప్రకటన
తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రకటించనున్న 2047 విజన్ డాక్యుమెంట్‌లో క్రీడా రంగం అభివృద్ధికి తీసుకోనున్న చర్యలను వెల్లడించనుంది. ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్‌తో కలిసి ప్రపంచంలోనే రెండో మహిళల ఫుట్‌బాల్ అకాడమీ, అలాగే దేశంలోనే రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు సహా పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీ నిర్వహణపై ప్రకటన చేయనుంది. ‘తెలంగాణ క్రీడా పాలసీ-2025’ ద్వారా క్రీడారంగానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, క్రీడాకారులకు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు.
Also Read: MP Raghunandan Rao: బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి.. ఎంపీ విజ్ఞప్తి

