Congress Politics: ఆయనను కాంప్రమైజ్ చేయడం ఎలా?
పదవి కేటాయింపుపై నేతల్లో ఉత్కంఠ
ఇద్దరి ఆశావహులకు కేబినెట్ ర్యాంకు హోదాతో సమానమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు!
మరికొంతమంది అసంతృప్తులతోనూ చర్చలు
కాంగ్రెస్‌లో పొలిటికల్ గేమ్ షురూ!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మంత్రి పదవి రేసులోని ఇద్దరి సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంక్‌తో సమానమైన నామినేటెడ్ పదవులు కేటాయించిన సర్కార్.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఎలా కాంప్రమైజ్ చేస్తుందనేది? ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తనకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా కూల్ చేయాలనే దానిపై సర్కార్ తర్జన భర్జన పడుతున్నది. గతంలో ‘కార్పొరేషన్ చైర్మన్ విత్ క్యాబినెట్ ర్యాంకు’ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన రాజగోపాల్ రెడ్డి.. మంత్రి పక్కాగా ఇవ్వాల్సిందేనని టీపీసీసీతో పాటు ఏఐసీసీ నాయకులతోనూ (Congress Politics) చర్చించారు.
తనకు మంత్రి పదవిపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం హామీ ఇచ్చిందని, అయితే సామాజిక సమీకరణాలు, జిల్లా రాజకీయాల కారణంగా ఇప్పటివరకు జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు ఛాన్స్ రాలేదని రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, ఏఐసీసీ స్పెషల్ కోటాలో తనకు మంత్రి ఇవ్వాల్సిందేనంటూ ఆయన ఇప్పటికీ పట్టుబడుతూనే ఉండటం గమనార్హం. పైగా ఆయన పదే పదే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా హెచ్చరించారు. అంతేగాక కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. సొంత ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
Read Also- New Rules: నవంబర్ 1 నుంచి 7 కొత్త రూల్స్… సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ప్రభావం!
మిగతా నేతలకూ…
రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి, ఇతర సీనియర్ల ఆశావహులను కూల్ చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఒక సమతుల్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి కావాలని అడుగుతున్న సీనియర్ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్లు విత్ క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వాలని ఏఐసీసీ సూచన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, గతంలో తిరస్కరించిన రాజగోపాల్ రెడ్డి దీనికి అంగీకరిస్తారా? లేదా? అనేది సస్పెన్స్‌గా ఉన్నది. మరోవైపు ప్రస్తుతం కేబినెట్ లో సీఎంతో కలిపి 16 మంది మంత్రులు ఉన్నారు. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో రంగారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ రెండు బెర్త్ ల భర్తీపై ఉత్కంఠ నెలకొన్నది.
సామాజిక న్యాయం…
కేబినెట్ లో సామాజిక న్యాయం పాటిస్తూ భర్తీలు జరుగుతున్నాయని టీపీసీసీ నాయకులు వివరణ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అర్హుడే అయినప్పటికీ, ఆయన సొంత సోదరుడు మంత్రిగా ఉండటం వంటి అంశాలు చిక్కులు తీసుకువచ్చినట్లు చెప్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ న్యాయం చేస్తుందని వివరిస్తున్నారు. అయితే ఆ పదవి ఎలాంటి రూపంలో ఉంటుందనేది ఇప్పుడు అంచనా వేయలేమని టీపీసీసీ నాయకులు ఒకరు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డిలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిజామాబాద్ కోటాలో ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. సుదర్శన్ రెడ్డి పక్కా అని భావించినప్పటికీ, ఆయనకు కేబినేట్ ర్యాంక్ తో మరోక పదవి కేటాయించడం గమనార్హం.
