Eye Screening Programs: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీల్లోనూ ‘ఐ’ స్క్రీనింగ్ నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతున్నది. ఈ నెల 7 న అధికారికంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే ఈ ప్రోగ్రామ్ షురూ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అంగన్ వాడీ కేంద్రాల్లో ఈ కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రెండు నెలల్లో విడతల వారీగా 9 లక్షల మంది చిన్నారులకు పరీక్షలు చేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యం పెట్టుకున్నది.
నేషనల్ హెల్త్ మిషన్ సహయంతో 2–6 ఏళ్ల లోపు చిన్నారులకు కంటి పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. ప్రివెంటివ్ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే స్కూల్ విద్యార్ధులకు ఓ దఫా కంటి పరీక్షలు పూర్తయ్యాయి.
అంత కంటే ముందు కంటి వెలుగు ప్రోగ్రామ్ ద్వారా 14 ఏళ్ల పై బడినోళ్లందరికీ పరీక్షలు చేయగా, తాజాగా రెండేళ్ల నుంచి ఆరు ఏళ్ల లోపు పిల్లలకూ కంటి పరీక్షలు చేయనున్నారు. స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాత అవసరమైనోళ్లకు అద్దాలతో పాటు చికిత్స కూడా ప్రభుత్వమే నిర్వహించనున్నది. సమస్యను వేగంగా గుర్తిస్తే నివారించడం సులుభం అనే ప్రాసెస్ లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి రూప కల్పన చేశారు.
Also read: CM Revanth Reddy: నిధులకు డోంట్ వర్రీ.. విద్యార్థుల కోసం ఎంతైనా ఓకే.. సీఎం రేవంత్ రెడ్డి
రూరల్ ఏరియాలకు ప్రాధాన్యత…
ఈ స్క్రీనింగ్ పరీక్షలను తొలుత రూరల్ ఏరియాల్లో నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పై ఇప్పటికే ఆర్ బీఎస్ కే టీమ్ ల ట్రీనింగ్ కూడా పూర్తయింది.మండలాలు వారీగా ఎంపిక చేసిన అంగన్ వాడీ కేంద్రాలకు ఆర్ బీఎస్ కే (రాష్ట్రీయ బాల స్వస్థ్య)టీమ్ లు వెళ్తాయి. అక్కడ చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్లకు కేవలం ఛార్ట్ ల ద్వారానే కంటి పరీక్షలు నిర్వహించే ఛాన్స్ ఉన్నదని ఓ అధికారి తెలిపారు.
డిజిటల్ విధానంలో చిన్నారుల కళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని వివరించారు. ఇక కంటి లో డాట్స్, రాషేస్, నీళ్లు కారడం, మెల్లకన్ను వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నోళ్లను రిఫరల్ ఆసుపత్రులకు పంపిస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్యం అందజేస్తారు. ఈ స్క్రీనింగ్ నిర్వహణ సమయంలో ఆయా చిన్నారుల పేరెంట్స్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ను వైద్యారోగ్యశాఖ సూచించింది.
పోషకాహార లోపంతో..?
ఇటీవల కాలంలో చిన్నారుల్లోనూ కంటి సమస్యలు తీవ్రమవుతున్నట్లు వివిధ హెల్త్ సర్వేలు ప్రకటిస్తున్నాయి. పోషకాహార లోపంతో పాటు మారుతున్న జీవన శైలీలో చిన్నారులు కంటి సమస్యల భారిన పడాల్సిన వస్తోన్నది. దీంతో ముందస్తుగా కంటి సమస్యలను గుర్తిస్తే, ఐ ఎక్స్ పర్ట్స్ ద్వారా సలహాలు ఇప్పించాలనే ఆలోచనలోనూ ప్రభుత్వం ఉన్నది.
ఈ నేపథ్యంలోనే సమస్య తీవ్రతను అంచనా వేసి చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ భావిస్తున్నది. ఇప్పటికే చిన్నారుల్లో శరీర పెరుగుదల, అవయవాల పనితీరును రెగ్యులర్ హెల్త్ చెకప్ లలో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హెల్త్ టీమ్స్ పరిశీలిస్తుండగా, ఇక నుంచి కంటి పరీక్షలను కూడా తరచూ చెక్ చేస్తామని ఓ అధికారి తెలిపారు.