CM Revanth Reddy: పిల్లల చదువుల కోసం.. విశ్వవిద్యాలయాల బాగు కోసం.. ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలోని విశ్వ విద్యాలయాలన్నీ విద్యార్థుల కేంద్రంగా పని చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ విశ్వ విద్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వస్తున్నారని.. వారికి సరైన భవిష్యత్ కల్పించేలా మన బోధన ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకొని ప్రైవేటు విశ్వ విద్యాలయాల వైపు వెళ్లిపోతున్నారని.. వారితో ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సులనే మనం బోధించాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. గతంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు ఉన్నారనే భావనతో పలు విశ్వ విద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆయా కోర్సులకు సంబంధించి ఉన్న ప్రొఫెసర్లకు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు అప్పగించాలని సీఎం పేర్కొన్నారు.
కొందరు ప్రొఫెసర్లకు రిహాబిలిటేషన్ సెంటర్లుగా యూనివర్సిటీలను మార్చొద్దని సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఆయా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు తమ విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాలు, ఇతర వసతుల సమస్యలను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. యూనివర్సిటీల బాగుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు అంతా సమావేశమై తమ ఉమ్మడి సమస్యలు, అలాగే యూనివర్సిటీల వారీగా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో సమావేశం కావాలని సీఎం సూచించారు.
Also Read: Hyderabad Drinking water: హైదరాబాద్ లో నీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడంటే?
అనంతరం యూనివర్సిటీల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, శ్రీనివాసరాజు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఏ.శ్రీదేవసేన, ప్రాథమిక విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, పలువురు పాల్గొన్నారు.