Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను గౌరవించాల్సింది పోయి వారిని అణచివేసేలా కొత్త నిబంధనలు తేవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ ) ప్రతినిధులు.. హరీశ్ రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల మధ్య చిచ్చు
డెస్క్ జర్నలిస్టులకు వేరు.. రిపోర్టర్లకు వేరు అంటూ రెండు కార్డుల విధానం తీసుకురావడం జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టడమేనని హరీశ్ రావు అన్నారు. వార్తను ప్రజల వరకు చేర్చడంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమేనని అన్నారు. అలాంటి వారికి అక్రిడిటేషన్ ఇవ్వకుండా కేవలం గుర్తింపు కార్డు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం వారిని కించపరచడమేనని హరీశ్ రావు అన్నారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 23 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చి గౌరవించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 13 వేలకు కుదించాలని చూడటం అంటే.. దాదాపు 10 వేల మంది జర్నలిస్టులకు అన్యాయం చేయడమే’ అని హరీశ్ రావు అన్నారు.
జర్నలిస్టులంటే పట్టింపు లేదా?
జర్నలిస్టుల సంఖ్యను తగ్గించి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని హరీశ్ రావు ప్రశ్నించారు. కొత్త జీవో వల్ల జర్నలిస్టుల హెల్త్ కార్డులు, బస్ పాస్ సౌకర్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని హరీశ్ రావు అన్నారు. ‘జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల, వారి ప్రయాణ సౌకర్యాల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయం. గతంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించి, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ ఇప్పుడు ఆ ప్రీమియం చెల్లించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తూ అన్యాయం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. అందుకే కేసీఆర్ గారు జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది’ అని హరీశ్ రావు అన్నారు.
Also Read: Strange Incident: యూపీలో ఆశ్చర్యం.. 29 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి.. మళ్లీ తిరిగొచ్చాడు!
‘అసెంబ్లీలో ప్రశ్నిస్తాం’
జర్నలిస్టులకు అన్యాయం చేసే ఈ జీవోపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తానని హరీష్ రావు అన్నారు. ఈమేరకు యూనియన్ నాయకులకు సైతం హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జీవో 252 సవరణ కోసం టీయూడబ్ల్యూజే (TUWJ) చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తగు సూచనలు చేసి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

