తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Government on HCU Land: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల టీజీఐఐసీ భూములపై విస్తున్న విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం స్పష్టమైన ఆలోచనతో ఉన్నది. విద్యార్థులతో పాటు న్యాయస్థానాలు ఆరోపిస్తున్నట్లుగా నెమళ్ళు, జింకలు, అరుదైన పక్షులు సంచరించేది యూనివర్శిటీకి చెందిన 1620 ఎకరాల పైచిలుకు భూముల్లోనేనని, టీజీఐఐసీకి చెందిన భూముల్లో వాటి సంచారానికి అనువైన వాతావరణమే లేదన్నది అధికారుల వాదన. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం మేరకు ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన హైకోర్టు రిజిస్ట్రార్‌కు సైతం ఆఫీసర్లు ఇదే విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం బుల్డోజర్లు చదును చేస్తున్న 400 ఎకరాల ప్రాంతంలో యూనివర్శిటీ భూములు లేవనే అంశాన్ని లెక్కలతో సహా చెప్పినట్లు సమాచారం.
జీవవైవిధ్యం, పర్యావరణ తదితర అంశాలపై ఉదాహరణలతో సహా స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. గచ్చిబౌలిలోని కొత్త, పాత భవనాల నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలతో 400 ఎకరాల ప్రాంతం ఒక డంపింగ్ యార్డులా మారిపోయిందని, దాదాపు పాతికేండ్లుగా ఆ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున ఆలనా పాలనా కరువైందని ఆఫీసర్లు అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం పడావుగా వదిలిస్తే పరిస్థితి ఇంకొంత దయనీయంగా మారుతుందని, అందుకే ఏదో ఒక రకమైన యాక్టివిటీస్ ఉంటే నియంత్రణ ఉంటుందని వ్యాఖ్యానించారు.
మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 100 ఎకరాల పరిధిలోని భారీ వృక్షాలను జేసీబీల సాయంతో తొలగించినట్లు వస్తున్న వార్తలపై అధికారి ఒకరు వివరణ ఇస్తూ, డ్రోన్ ద్వారా తీసిన ఏరియల్ ఫోటోలతో అవి ఏపుగా పెరిగిన చెట్లు అనే భావన కలుగుతున్నదని, కానీ అవన్నీ పిచ్చి చెట్లతో పెరిగిన తుప్పలేనని వ్యాఖ్యానించారు. నిజానికి చెట్లు లేని ప్రాంతమైనందునే ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ అవసరాలకు అప్పటి ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. ఇప్పుడు నెమళ్ళు, జింకలు తిరుగుతున్నది యూనివర్శిటీకి చెందిన భూముల్లో మాత్రమేనని, ఇక్కడ వాటి అవసరాలకు అనువైన పరిస్థితులు లేనందున ఆవాసాలుగా మారలేదన్నది ఆఫీసర్ల అభిప్రాయం.
దీర్ఘకాలంగా నిర్మానుష్యంగా వదిలేయడంతో యూనివర్శిటీ నుంచి అప్పుడప్పుడూ వచ్చిపోతాయేమోగానీ అవి సేద తీరేందుకు 400 ఎకరాల భూమి అనువైనదిగా లేదనేది వారి భావన. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లే ఔట్‌తో డెవలప్‌మెంట్ చేసి పరిశ్రమలకు ఇచ్చినా ఆ భూముల్లోని మష్‌రూమ్ రాక్స్, వాటర్ బాడీస్ యధావిధిగానే ఉంటాయని, వాటిని కనుమరుగు చేసే ఆలోచన కూడా ప్రభుత్వ ప్రణాళికలో లేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఈ విషయాలన్నీ చెప్పామని, కానీ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో భిన్నమైన అంశాలు రావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు.
Also read: MMTs To Yadagirigutta: యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్? ఎంపీ చామల ఏమన్నారంటే?