GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోటిన్నర మంది జనాభాకు అత్యవసర సేవలందించే బల్దియా ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్(Property tax) వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూ. 2500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటి వరకు సుమారు రూ. వెయ్యి కోట్ల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసిన జీహెచ్ఎంసీ(GHMC) ఈ ఆర్థిక సంవత్సరం వచ్చే మార్చినెలాఖరు కల్లా రూ. 2500 టార్గెట్ ను ఎట్టి పరిస్థితుల్లో అధిగమించాల్సిందేనని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం అప్పటి కమిషనర్ ఇలంబర్తి రూ.2 వేల కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ గా ఇవ్వగా, ఆర్థిక సంవత్సరం ముగిసేకల్లా సుమారు రూ.2038 కోట్లను వసూలు చేసి రికార్డును సృష్టించారు.
సరిగ్గా పదేళ్ల క్రితం 2014-15 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్ రూ. వెయ్యి కోట్ల కలెక్షన్ను దాటించగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ రూ.2 వేల కోట్లు దాటి రూ.2038 కోట్లకు చేరింది. కానీ ఇందులో రూ.70 కోట్ల వరకు ట్యాక్స్ చెల్లిస్తూ సమర్పించిన చెక్కులు బౌన్స్ కాగా, వాటికి సంబంధించిన ట్యాక్స్ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను సర్కిల్ స్థాయిలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్లతో కమిటీ వేసి, బాధ్యతలను అప్పగించారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలవుతున్నా, జీహెచ్ఎంసీ ట్యాక్స్ సిబ్బంది కొద్ది రోజుల క్రితం వరకు కేవలం అక్టోబర్ మాసం నుంచి ట్యాక్స్ కలెక్షన్ దృష్టి సారించి, జనవరి మాసం నుంచి పూర్తి స్థాయిలో ఫీల్డు లెవెల్ కలెక్షన్ కు వెళ్లేవారు. కానీ ప్రస్తుత కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) ట్యాక్స్ కలెక్షన్ ఏడాది పొడువున నిరంతరం జరగాలని ఆదేశించినట్లు సమాచారం.
ఆ ప్రాపర్టీలే టార్గెట్
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ(GHMC) ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాని, అసెస్ మెంట్ కాని రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలను ఫీల్డు లెవెల్ లో గుర్తించి నివేదికలను సమర్పించాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) ఇటీవలే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రతి సర్కిల్ లో కొత్తగా నిర్మించిన భవనాలను గుర్తించి, వాటిలో రెసిడెన్షియల్ ఎన్ని? కమర్షియల్ ఎన్ని? వాటిలో ఆస్తి పన్ను పరిధిలో ఉన్నవి ఎన్ని? అన్నవి గుర్తించి తనకు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Medak Crime: కల్లు సీసాతో పొడిచి.. బండ రాయితో దారుణ హత్య
కొన సాగు తున్న జీఐఎస్ సర్వే
ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ(GHMC) సిటీలోని 30 సర్కిళ్లలోనున్న ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న సుమారు 19.5 లక్షల ఆస్తులపై జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే(GIS)ను 2024 జూలై మాసంలో ప్రారంభించింది. ఈ సర్వే బాధ్యతలు స్వీకరించిన నియోజియో సంస్థ ఇప్పటి వరకు సిటీలోని సుమారు పదిన్నర లక్షల ఆస్తులపై సర్వేను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా సిటీలో ఎన్ని భవనాలున్నాయి? వీటిలో కమర్షియల్ భవనాలెన్నీ? రెసిడెన్షియల్ భవనాలెన్నీ? తీసుకున్న నిర్మాణ అనుమతులేంటీ? వినియోగం ఏమిటీ అన్న కోణంలో ఈ సర్వే కొనసాగుతుంది.
అయితే ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో చాలా ఆస్తులకు సంబంధించి ఆస్తి పన్ను చెల్లించకుండా చాలా భవనాలను అదనపు అంతస్తులను నిర్మించి, వినియోగిస్తున్నట్లు, ఇదే తరహాలో మరి కొన్ని కమర్షియల్ భవనాలు కూడా అదనంగా అంతస్తుల వేసి వినియోగిస్తూ రెసిడెన్షియల్ యూసేజీ చేస్తున్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ రకంగా పన్ను పరిధిలోకి రాని భవనాలను పన్ను పరిధిలోకి తీసుకురావటంతో పాటు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ యూసేజీ చేస్తున్న భవనాల యూసేజీని కన్వర్ట్ చేస్తే, జీహెచ్ఎంసీకి అదనంగా మరో రూ. వెయ్యి కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ అయ్యే అవకాశముంది. రానున్న రెండు నెలల్లోనే జీఐఎస్ సర్వే పూర్తి చేయాలని అధికారులు నియోజియో సంస్థకు సూచించినట్లు సమాచారం.
Also Read: Bhatti Vikramarka: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. భట్టి విక్రమార్క