Prajavani: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి’ కి మొత్తం 150 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 60 విన్నపాలు రాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 90 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అందులో కూకట్ పల్లి జోన్ లో 39, సికింద్రాబాద్ జోన్ 13 , శేరిలింగంపల్లి జోన్ లో 10, ఎల్బీనగర్ జోన్ 11, చార్మినార్ జోన్ లలో 8, ఖైరతాబాద్ జోన్ లో 9 విన్నపాలు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు, వినతులను స్వీకరించిన జీహెచ్ఎంసీ అధికారులు సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు అందజేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆడిషన్ కమిషనర్లు మంగతాయారు, వేణుగోపాల్, పంకజ, గీత రాధిక, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, అడిషనల్ సి సీపీ గంగాధర్ ప్రదీప్ , చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, డైరెక్టర్ యూబీడీ వెంకటేశ్వర్ రావు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ నిత్యానందం, ఎలెక్ట్రిసిటీ ఈఈ మమత, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) సంపద, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పనస రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఎన్ డీపీ) పీవీ రావు, హౌసింగ్ ఈఈ లు పీవీ రవీందర్, రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఈఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ప్రజావాణికి 161 ఆర్జీలు
ప్రజాలు వివిధ రకాల సమస్యలకు సంబంధించి హైదరాబాద్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 161 ఆర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముకుందారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి తో కలసి అదనపు కలెక్టర్ ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వికలాంగులు, వయోవృద్ధుల అర్జీల సమర్పణ సులభతరం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రవేశపెట్టిన వాట్సాప్ నెంబరు ద్వారా వచ్చే అర్జీలకూ అధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని, దరఖాస్తుల పై ఎండార్స్ మెంట్ చేసి సంబంధిత శాఖల అధికారులకు సమర్పించారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార ద్వారా వచ్చిన దరఖాస్తుల పురోగతిపై ఆయన సమీక్షించారు, పెండింగ్ లో ఉన్న ఆర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 161 అర్జీలు రాగా, అందులో హౌసింగ్ శాఖ 97, (డబుల్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు), పెన్షన్స్ 22, రెవెన్యూ 12, ఇతర శాఖలకు చెందిన 30 ఆర్జీలున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజావాణిలో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.